"ఉమ్మడి తూ, గో, జిల్లా ద్వారానే నిర్వహణ
"358 కేంద్రాలు 66,696 మంది పరీక్షార్థులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, ఏప్రిల్ 26, (విశ్వం వాయిస్ న్యూస్) ;
కరోనా మహమ్మారి ఎన్నో రంగాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యారంగంపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. ఎన్నో అద్భుతాలు సృష్టించింది. రెండేళ్ల పాటు పదో తరగతి పరీక్షలు రాయకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించింది. 2020, 2021 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించ లేదు. గత ఏడాది ఏదో రకంగా పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నించినా చివరి నిమిషాల్లో రద్ద చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన జరిగి నప్పటికీ పూర్వపు తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగానే అధికార యంత్రాంగం ఈ ప్రస్తుత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను చేసింది. ప్రస్తుత పరీక్షల నిర్వహణకు సంబంధించి తగిన ఏర్పాట్లను కాకినాడ జిల్లా విద్యా శాఖ అధికారిణి దాట్ల సుభద్ర పూర్తి చేశారు. మొత్తం 358 పరీక్షా కేంద్రాల ద్వారా 66,696 మంది పరీక్షార్ధులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లాలో 144 కేంద్రాలలో 27,849 మంది విద్యార్థులు, అలాగే కోనసీమ జిల్లా పరిధిలో 112 కేంద్రాలలో 19,944 మంది, నూతన తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 79 కేంద్రాల్లో 15,032 మంది, పాడేరు జిల్లాలో పరిధిలోకి వెళ్ళిన ఏజెన్సీ ప్రాంతంలో 23 కేంద్రాల్లో 3,871 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 36 రూట్లు ఏర్పాటు చేశారు. అలాగే 72 పోలీస్ స్టేషన్లో ఈ ప్రశ్నా పత్రాలను భద్రపరుస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 358 మందు చీఫ్ సూపరింటెండెంట్లు, సుమారు నాలుగు వేల మంది ఇన్విజిలేటర్లును అధికారులు నియమించారు.