" భవిష్యతు బాగుకూ మళ్ళీ వైసిపినె గెలవాలు
" వై.కా.పా. ది మహిళా పక్షపాతి ప్రభుత్వం
" 13.966 మందికి రూ. 88,78,934 పంపిణీ
" సున్నా వడ్డీ లబ్ది పంపిణీలో ఎమ్మెల్యే ప్రకట
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, ఏప్రిల్ 30, (విశ్వం వాయిస్ న్యూస్) ;
రాష్ట్రంలో ప్రతీ ఐదేళ్ళకూ ఒకసారి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులూ వస్తూంటారు, వెళుతూ ఉంటారు… కానీ వీరెవరూ మీకు శాశ్వతం కాదు. ప్రజలే శాశ్వతం. మీరు, మీ పిల్లలు, వారి బాగు, మీకు జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధే శాశ్వతమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాజకీయాల్లో మేం కానీ, మా పదవులు కానీ శాశ్వతం కాదని ఆయన స్పష్టం చేశారు. మీ కోసం , మీ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్న ప్రభుత్వం, పార్టీ కోసం మీరు కూడా ఆలోచించాలని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీ పిల్లల భవిష్యత్తు తరాలకూ శాశ్వతం కావాలంటే మీరు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గద్దె నెక్కించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఈ పార్టీకి కాదని, ఆ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా ఏయే పధకాలు ప్రవేశ పెడుతుందోనని ఊహించుకుని వచ్చే ఎన్నికల్లో మీరేమైనా పొరపాటు చేస్తే… దెబ్బ తినేది మీరేనని, మళ్లీ జన్మభూమి కమిటీల పీడ మొదలు అవుతుందని ఎమ్మెల్యేపర్వత ప్రసాద్ హెచ్చరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఆయన వివరించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని శ్రీసత్యదేవా కల్యాణ మండపం ఆవరణంలో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన మండలంలోని డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ లబ్ది పంపిణీ కార్యక్రమ సభలో ఆయన మహిళలు, మిగతా సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళా శక్తి సంఘాలకు మూడో విడత సున్నా వడ్డీ కింద రూ. 1261 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయగా అందులో శంఖవరం మండలంలోని 1,357 స్వయం శక్తి మహిళా సంఘాల్లోని 13,966 మంది సభ్యులకు రూ. 88,78,934 లను నేరుగా లబ్దిదార మహిళల బ్యాంకుల పొదుపు ఖాతాల్లో ప్రభుత్వం తాజాగా జమ చేసేసింది. ఈ మేరకు ఈ అభివృద్ధి ప్రజలకు బహిరంగ పరచేందుకు ఆ మొత్తం సొమ్ము తాలుకు నమూనా బ్యాంకు చెక్ ను శంఖవరం మండల ప్రజా పరిషత్తు పాలక వర్గం అధ్యక్షుడు పర్వత రాజబాబు అధ్యక్షతన నిర్వహించినసభలో లబ్దిదారులకు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలన్నిటినీ యధావిధిగా నిరంతరం అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి వివిధ సంక్షేమ పధకాల ద్వారా ఏటా రూ. 60,000 నుంచి 1,000,00 వరకూ నగదు రూపంలో మంజూరు, విడుదల చేస్తూ ఆర్ధికంగా లబ్దిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేకూరుస్తూ ఉన్నారని ఆయన ప్రభుత్వం తరఫున సాక్ష్యం ఇచ్చారు. స్వయం శక్తి సంఘాల సభ్యులు ఎవరైతే రుణాల స్వీకరించి, సక్రమంగా తిరిగి బ్యాంకులకు చెల్లింపులు చేస్తున్నారో వారందరికీ సున్నా వడ్డీ పధకం మొదలుకొని వివిధ సంక్షేమ పధకాలు అన్నీ వర్తిస్తూ ఉన్నందున సంఘాల పనితీరును మరింత మెరుగు పర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
సంఘాల అభివృద్ధి, ఈ సున్నా వడ్డీ పధకం వర్తింప చేయడంలో వీఓఏల పని తీరు బాగున్నందునే స్వయం శక్తి సంఘాలకు లబ్ది చేకూరు తోందంటూ వీఓఏల సేవలను ఆయన ప్రశంసించారు. మహిళా సంఘాల సభ్యులతో వారి అనుభవాలను సభలో చెప్పించారు. ఎంపీపీ రాజబాబు, ఎంపీడీవో జాగారపు రాంబాబు, చివర్లో హాజరైన అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మరి కొందరు మాట్లాడారు. వీఓఏలు అందరూ కలసి జడ్పీటీసీ సభ్యురాలు తరుం మల్లేశ్వరి, ఎంపీపి. రాజబాబును సన్మానించారు. ఇంకా కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు నందా వెంకట రమణ, వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు, వైఎస్సార్ క్రాంతి పధం ఏపీఎం. జి.వరప్రసాద్, కత్తిపూడి సిసి సీత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులూ పాల్గొన్నారు.