విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కే గంగవరం:
కే గంగవరం, విశ్వం వాయిస్ః
రైతు సంక్షేమమే పరమావధిగా వారి అభివృదే రాష్ట్ర పురోగాభివృద్ధిగా భావించి రైతులకు ఎల్లప్పుడు చేదోడువాదోడుగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు . సోమవారం స్థానిక మండలం కుందాడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి వరి కోత విధానాల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దరి చేర్చే దిశగా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాలు ద్వారా కృషి చేస్తోందన్నారు .వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరితేనే సార్థకత చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విస్తరణ సేవలు బలోపేతం, రైతులు సాగులో మెలకువలు నేర్చుకోవడం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన లాభసాటి ఉత్పత్తులను సాధించడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ,సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. చేయాలన్నారు . సేంద్రియ పంటల యజమాన్య పద్దతులు ఆచరించాలన్నారు. రైతు సోదరులు సాంకేతిక పరిజ్ఞానం, స్వయం నిర్ణయాధికారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు . దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలు అప్పుల బారిన పడకూడదని, రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తెచ్చి ఏడాదికి 13,500 రూపాయలు అందిస్తోందన్నారు .తద్వారా పెట్టుబడి వ్యయం ప్రభుత్వం సమకూరుస్తొందన్నారు. రైతులకు బహుముఖ సేవలందించే రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగం ఒక చిత్రాన్ని సమూలంగా మార్చి వ్యవస్థలుగా ఆర్ బి కే లు పేరిట అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులు మార్కెట్ మాయాజాలానికి, మధ్య దళారుల వ్యవస్థకు బలికాకుండా గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూడా ఇవి తోడ్పాటు అందిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సదుపాయాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని మెరుగైన జీవనాన్ని గడపాలన్నారు. గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం సేద్య విధానాలపై కూడా రైతాంగం దృష్టిసారించి సేంద్రియ ఉత్పత్తులసాధన దిశగా ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కుందాడ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.