విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎంతగా అభివృద్ధి జరిగినప్పటికీ అసమానతలు కూడా తీవ్రంగా పెరుగుతాయని, నిజమైన సమానత్వం సోషలిజంలోనే సాధ్యం అవుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
గురువారం రాత్రి తొలితరం కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక యుటిఎఫ్ హోంలో రఘుపతి వేంకటరత్నం నాయుడు (ఆర్.వి.ఎన్.) స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో “సోషలిజమే భవిష్యత్తు” అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
స్టడీ సర్కిల్ కన్వీనర్ ఐ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎవి నాగేశ్వరరావు ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్యం, వైద్య సేవలను పరిశీలిస్తే సోషలిస్టు దేశాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాయన్నారు. అందరికీ విద్య, ఉపాధి కల్పనకు సోషలిజంలో ప్రభుత్వ బాధ్యతగా ఉంటుందన్నారు. శక్తి కొలదీ పని , శ్రమకు తగ్గ ప్రతిఫలం సోషలిస్టు సమాజ సూత్రంగా ఉంటుందన్నారు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతకంతకూ అసమానతలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. .
కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నేత డాక్టర్ చెలికాని స్టాలిన్ మాట్లాడుతూ సుందరయ్య గారి త్యాగాలను కొనియాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ భూమి, మౌలిక పరిశ్రమలు, కీలకమైన ఆర్ధిక సంస్థలు ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని అదే స్టేట్ సోషలిజం అని బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
ఈ సదస్సు సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు ఆహ్వానం పలుకగా జనవిజ్ఞాన వేదిక నాయకులు జిఎస్హెచ్పి వర్మ వందన సమర్పణ చేశారు. ఉపాధ్యాయిని దుర్గాదేవి పాడిన పాటలు అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.