విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
రావులపాలెం,( విశ్వం వాయిస్ న్యూస్ ) మే 28,
అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల సాకుతో పోలీసులు గత నాలుగు రోజులుగా కోనసీమ జిల్లాలో ఇంటర్ నెట్, మొబైల్ నెట్ సేవలను నిలిపి వేసి జన జీవనం స్తంభింపజేయడం ఎంతవరకు సమంజసం, మనం కోనసీమలో ఉన్నామా లేక కాశ్మీర్ లోయలో ఉన్నామా అని బీజేపీ రాష్ట్ర నాయకుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శనివారం రావులపాలెం బీజేపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొవ్వూరి వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోనసీమ అంబేద్కర్ పేరుతో జిల్లా పేరు మార్పు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా అమలాపురంలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, అయితే ఆ నెపంతో అధికారులు గత నాలుగు రోజులుగా ఇంటర్ నెట్ సేవలను నిలిపివేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. హింసాత్మక ఘటనలకు బాధ్యులను అరెస్టు చేసామని, శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెబుతున్న పోలీసులు ఇంకా ఇంటర్ నెట్ సేవలను నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం ప్రజలు డిజిటల్ సేవలకు అలవాటు పడ్డారని, చింతపండు కొనాలన్నా కూడా మొబైల్ యాప్ ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారన్నారు. కరెంట్ బిల్లు తదితర అన్ని నగదు లావాదేవీలు మొబైల్ యాప్ ల ద్వారా చేయడం జరుగుతుందని ఈ పరిస్థితుల్లో ఇంటర్ నెట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కరోనా నేపథ్యంలో ఇంకా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు జిల్లా దాటి వెళ్ళి తమ కార్యకలాపాలను చక్కదిద్దుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ఆఖరికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నా కూడా మొబైల్ లో ఇంటర్ నెట్ అవసరం అన్నారు. ఆదివారం పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతున్నాయని, ఇంటర్ నెట్ లేకపోతే విద్యార్థులు హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం డిజిటల్ సేవలకు అలవాటు పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్ నెట్ నిలిపివేసి ప్రజలపై కక్ష్య సాధింపు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఎంతో సమస్యాత్మక ప్రాంతమైన కాశ్మీర్ లోనే ఇంటర్ నెట్ సేవలను సక్రమంగా అందిస్తుంటే ప్రశాంతమైన కోనసీమలో ఆంక్షలు పెట్టి జన జీవనాన్ని స్తంభింపచేయడం ఏమిటన్నారు. వెంటనే కోనసీమ జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను పునరుద్ధరించాలని, లేని పక్షంలో మరోసారి కోనసీమలో ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కోనసీమ జిల్లా పేరుతో పచ్చని కోనసీమలో చిచ్చు రాజేసి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు చలికాచుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి జైలు పాలు కావడంతో వచ్చిన అప ఖ్యాతి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కోనసీమ జిల్లా పేరుతో అధికార వైసీపీ డ్రామా ప్రారంభించిందని ఆరోపించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిని కిరాయి మూకలు తగులబెట్టాయో, వైసీపీ వర్గం వారే పథకం ప్రకారం దగ్ధం చేసారో తెలియదు కానీ ఇల్లు దగ్ధం అవుతుంటే ఫైర్ ఇంజన్ ని రప్పించి అరగంటలో మంటలు ఆర్పలేరా.. ఎందుకు పూర్తిగా దగ్ధమయ్యేంత వరకు వదిలేసారని ప్రశ్నించారు. జిల్లా పేరు మార్పుపై నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందే సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులోకి తెచ్చిన పోలీసులు దానికి తగినంత సిబ్బందిని, ఫైర్ ఇంజన్ తదితర ఏర్పాట్లను ఎందుకు సిద్ధం చేసుకోలేదని ప్రశ్నించారు. ఎస్పీ నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం అంతా అమలాపురం పట్టణంలో ఉండి కూడా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాల కోసం, మీ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం జనాలతో ఆడుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ రావులపాలెం మండల ప్రధాన కార్యదర్శి మంచిగంటి కృష్ణ, ఆత్రేయపురం మండల అధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చింతా సత్యనారాయణరెడ్డి, చింతా భాస్కరరెడ్డి, కొవ్వూరి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.