విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మరియు పరిసర ప్రాంత విద్యార్ధులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ఈ ఏడాది కూడా సాకారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని కామన్ మేన్ ఫౌండేషన్ ఛైర్మన్ కాశి చంద్ర మౌళి ఆవేదన వ్యక్తంచేశారు. రేపో ఎల్లుండో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పేద విద్యార్థులందరూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం వేచి చూస్తున్నారన్నారు. ఇది వరకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్.కే.బి.ఆర్ ఎయిడెడ్ కళాశాలలో ఫీజులు తక్కువగా ఉండేవని ఇప్పుడు 15వేల నుండి 20వేల వరకు ఫీజులు ఉంటున్నాయని ఇక ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరిస్థితి చెప్పనక్కరలేదని అన్నారు. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ, బీసి కులాలకు చెందిన పేద విద్యార్థులు అధికమని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్.కే.బి.ఆర్ ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కలిసినా చొరవ చూపలేదన్నారు. ఐతే ఇటీవల ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండాలనీ లేని పక్షంలో కొత్తగా ఏర్పాటు చేస్తామని విడుదల చేసిన ప్రకటన (CCE ‘s Memo No 27/O.P.II.2020 Dt 24-03-2022) పట్ల పేద విద్యార్థులందరూ చాలా సంతోషించారన్నారు. ఐతే ఈ విద్యా సంవత్సరం మరి కొన్ని రోజుల్లో మొదలు కాబోతున్నా ఇంకా అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రస్తావన ఎక్కడా కనిపించకపోవడం తో విద్యార్థులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనౌతున్నారని, అసలు ఈ విద్యా సంవత్సరం అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ఉందో లేదో అర్థం కావడం లేదని కామన్ మేన్ ఫౌండేషన్ ఛైర్మన్ కాశి చంద్ర మౌళి ఆవేదన వ్యక్తంచేశారు.