విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
దంతాల సంరక్షణతో శారీరక ,మానసిక, సామాజిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని దంత వైద్యులు డాక్టర్ సువర్ణ రాజు పేర్కొన్నారు. స్థానిక రమణయ్యపేట ఏపీ ఐ ఐ సి కాలనీ లో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దంతాలు దృఢంగా, పటిష్టంగా ఉంటేనే అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోగలరని అన్నారు. పోషకాలు సక్రమంగా అంది రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. దంతక్షయం వల్ల నమిలే ప్రక్రియ కుంటుపడుతుంది అని అన్నారు. దంతక్షయం వల్ల నోటి దుర్వాసన వస్తుందని, తద్వారా సరిగ్గా నవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఒక్కొక్కసారి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది అని అన్నారు. దంతాల మధ్య ఖాళీలు ఏర్పడితే వెంటనే దంత వైద్యులను సంప్రదించాలని సూచించారు .రోజు ఉదయం రాత్రి పడుకోబోయే ముందు దంతాలను శుభ్రం చేయాలని, ఆహారం తీసుకున్న తర్వాత మంచి నీటితో నోటిని పుక్కిలించాలి అని సువర్ణ రాజు తెలిపారు .అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.