ePaper
Monday, November 16, 2026
ePaper
HomeEDITOR VOICEఆర్నబ్ తుఫాను సమయంలో ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేసిన వారియర్స్‌కు ఘన సన్మానం

ఆర్నబ్ తుఫాను సమయంలో ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేసిన వారియర్స్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

అధికారుల సమన్వయం, అంకితభావం అభినందనీయం

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

ఆర్నబ్ తుఫాను సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా భావించి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించి సేవలందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించారు. విపత్తు సమయంలో అధికారులు చూపిన సమన్వయం, సమయస్ఫూర్తి, అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ రామచంద్రపురం అధ్యక్షుడు తిరుమలరాజు ప్రభాకర్ వర్మ (చందమామ వాసు) అధ్యక్షతన ఈరోజు రామచంద్రపురం లయన్స్ క్లబ్‌లో ఆర్నబ్ తుఫాను వారియర్స్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ… తుఫాను సమయంలో పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖలు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారని తెలిపారు. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడినప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. విపత్తు సమయంలో ప్రజలకు భరోసా కల్పిస్తూ సేవలందించిన ప్రతి ఒక్కరూ అభినందనలకు అర్హులని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి, సమన్వయం భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు.కూటమి పార్టీ సీనియర్ నేత వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ… ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అండగా నిలవడం ఎంతో ముఖ్యమన్నారు. ఆర్నబ్ తుఫాను సమయంలో అధికారులు, సిబ్బంది చూపిన సేవా స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని తెలిపారు. కష్టకాలంలో ప్రజల కోసం పనిచేసే వారిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ సన్మాన కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ మాట్లాడుతూ… తుఫాను సమయంలో అధికారులు సమయస్ఫూర్తితో స్పందించడం వల్ల ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు సకాలంలో అందాయని తెలిపారు. ప్రజా సేవలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ…విపత్తు సమయంలో విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యంగా భావించి రాత్రింబవళ్లు పనిచేసిన సిబ్బంది సేవలు మరువలేనివని అన్నారు. ప్రజల భద్రత కోసం తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి పనిచేసిన వారిని గౌరవించడం ఎంతో సంతోషకరమని తెలిపారు.మున్సిపల్ చైర్ పర్సన్ మేడిశెట్టి శేషారావు మాట్లాడుతూ… ఆర్నబ్ తుఫాను సమయంలో మున్సిపల్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్యం, రహదారులపై పడిన చెట్ల తొలగింపు, ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేశామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తుఫాను సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న సుమారు 40 మంది వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్. రాజు, డీఎస్పీ ఎం. శేషు, సీఐ వెంకటనారాయణ, ఎస్సై నాగేశ్వరరావు,లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్, సెక్రటరీ వీరబాబు, లయన్స్ రీజనల్ చైర్మన్ జంపన సుమన్ వర్మ, జోనల్ చైర్మన్ కొండపల్లి విశ్వతేజ, తహసీల్దార్ బండి మృత్యుంజయరావు, ఎస్ఐ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, లయన్స్ క్లబ్ సభ్యులు జీవీ రావు, గుణ్ణం రామకృష్ణ, చిట్టిబాబు, బరగాటి కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img