కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):
జాతీయ గీతం–వందేమాతరం తెలుగు భావానువాదం ఆకట్టుకుంటోంది
స్వాతంత్ర్య స్ఫూర్తిని సులభంగా అర్థం చేసుకునేలా వినూత్న ఏర్పాటు
కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక ప్రదర్శన
ఆర్డీఓ ఎస్. మల్లిబాబు చొరవకు అభినందనలు
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ గీతం, వందేమాతరం గేయాల భావాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకునే విధంగా తెలుగులో సరళమైన అనువాదంతో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
కాకినాడ ఆర్డీఓ ఎస్. మల్లిబాబు చొరవతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన కార్యాలయానికి వచ్చే అధికారులు, సిబ్బంది, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. జాతీయ గీతం, వందేమాతరం గేయాల్లోని ప్రతి పదం వెనుక ఉన్న భావం, దేశభక్తి, స్వాతంత్ర్య స్ఫూర్తిని సులభమైన తెలుగు భాషలో వివరించేలా ఈ ఏర్పాటు చేశారు.
దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశ విశిష్టత, మాతృభూమిపై ప్రేమ, జాతీయ సమైక్యత వంటి గొప్ప భావాలను ఈ గేయాలు ప్రతిబింబిస్తాయని, వాటి అర్థాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలుగు భావానువాదాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
సాధారణంగా జాతీయ గీతం, వందేమాతరం ఆలపించే సమయంలో వాటిలోని పదాల పూర్తి భావం అందరికీ తెలియకపోవచ్చని, అందుకే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాటి అంతరార్థాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
దేశభక్తిని పెంపొందించడంతో పాటు యువతలో జాతీయ భావాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఏర్పాటు చేసిన ఈ తెలుగు భావానువాద ప్రదర్శనపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

