– తెచ్చిన డబ్బులకు వడ్డీ కట్టలేని పరిస్థితి
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
రాజానగరం మండలం చక్రధ్వారబంధం గ్రామంలో రాఖీ అవెన్యూస్ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్-2 పేరుతో తమ వద్ద డబ్బులు కట్టించుకుని నిలువునా మోసం చేసిందని బాధితులు లబోదిబో మంటున్నారు. రాఖీ అవెన్యూస్ పేరుతో మొదటి వెంచర్ విజయవంతంగా చేయడంతో తాము రెండో వెంచర్‌లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పటికీ నాలుగో సంవత్సరం వచ్చినా కనీసం పనులు పూర్తి చేయకుండా సంస్థ నిర్వాహకుడు వేణు రామయ్య తమను మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థలో పెట్టుబడి పెట్టిన బాధితులు మాట్లాడారు. ధవళేశ్వరానికి చెందిన మెండా మృత్యుంజయరావు, చెన్నైకి చెందిన శ్రావణి, భీమవరానికి చెందిన నటరాజ్, మోహన్‌రావు తదితరులు మాట్లాడుతూ మూడేళ్ల కాలంలో చంద్రిక అవంతిక ఫేజ్`2లో అపార్ట్‌మెంట్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు నాలుగో ఏడాది కూడా పూర్తవుతోందని అయినా నిర్మాణాలు చాలా వరకు ప్రారంభమే కాలేదన్నారు. రాజమహేంద్రవరం ఎవి అప్పారావు రోడ్‌లో ఉన్న రాఖీ అవెన్యూస్ కార్యాలయానికి వెళ్లినా తమకు సరైన విధంగా సమాధానం చెప్పడం లేదన్నారు. సంస్థ యజమాని వేణు రామయ్య ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని, స్పందనలో ఫిర్యాదు చేసామని దాన్ని రాజానగరం పోలీస్ స్టేషన్‌కు పంపారని, పోలీసులు అతడి ఆచూకీ లేదని ఆ కేసును పక్కన పడేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విధంగా సుమారు 35 మంది బాధులు 95 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు తక్కువ కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరుతో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని, తాము కట్టిన డబ్బులకు సంబంధించి సంస్థ ఇచ్చిన అన్ని రసీదులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తమ ద్వారా డబ్బులు కట్టించుకున్న దళారులు ఇదిగో పూర్తి చేస్తాం.. అదిగో పూర్తి చేస్తాం అంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. అందమైన బ్రోచర్లు, ప్రముఖ యాంకర్‌తో విస్తృతంగా రెండో ఫేజ్‌కు ప్రచారం చేస్తే అంతా నిజమని తాము డబ్బులు కట్టి ఇప్పుడు పూర్తి మోసపోయామన్నారు. అయితే ఈ విధంగా డబ్బులు కట్టిన వారు సుమారు 130 మంది వరకు ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. తమ వద్ద వసూలు చేసిన డబ్బుతో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి ఫామ్ ల్యాండ్స్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోందన్నారు. రిటైరైన తరువాత కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడుపుతామనే ఉద్దేశ్యంతో చక్రధ్వార బంధంలో ఫ్లాట్లు కొనుగోలు చేసామని తెలిపారు. కొంత మంది ఫ్లాట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించేసారని, మరి కొంత మంది బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని మూడేళ్ల నుంచి ఇఎంఐలు కడుతున్నారని వివరించారు. మేము చెల్లించిన డబ్బును తక్షణం మాకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేసారు.