విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం , విశ్వం వాయిస్ః
ప్రపంచ మానవాళి కోసం పరితపించిన పోరాట వీరుడు ,సోషలిస్టు నిర్మాత వి ఐ లెనిన్ స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడతామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక సిపిఐ కార్యాలయంలో వి ఐ లెనిన్ 152వ జయంతి సందర్భంగా సిపిఐ రాజమండ్రి నగర సమితి ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ
కామ్రేడ్ లెనిన్ కార్ల్ మార్క్స్ ఏంగిల్స్ రచించిన కమ్యూనిజం సిద్ధాంతాన్ని ఆయన ఆచరణలో పెట్టి చూపించారన్నారు.1917 నవంబర్ 7న సోషలిస్టు వ్యవస్థ కు పునాదులు వేశారన్నారు. ఆయనెప్పుడూ సామ్రాజ్యవాదం విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారన్నారు. మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని ఆయన నొక్కి చెప్పారన్నారు. పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ప్రపంచానికి సోషలిస్టు వ్యవస్థ మార్గమని నిరూపించిన గొప్ప ఆదర్శ వ్యక్తని ఆయన అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను తూట్లు పొడుస్తోందని, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కే రాంబాబు సిపిఐ నగర సహాయ కార్యదర్శి వి.కొండలరావు,కార్యవర్గ సభ్యులు సప్ప రమణ ,బొమ్మసాని రవిచంద్ర ,సీపీని రమణమ్మ ,ఎస్.నౌరోజీ ,కె .రామకృష్ణ తదితరులు పాల్గున్నారు.