విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ గ్రామీణ, విశ్వం వాయిస్ః
వృక్షసంపద జీవావర్ణాన్ని పర్యవేక్షిస్తూ, మానవాళికి జీవనోపాధి కల్పిస్తూ ఆత్మ బంధువుగా నిలుస్తుందని దరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు ఎస్. సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దరిత్రి రక్షిత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమాత అని అన్నారు. భూమాత చల్లగా ఉంటేనే సమస్త జీవరాశి సజావుగా మనుగడ సాగిస్తుందని అన్నారు. కానీ దట్టమైన అడవులను నరికేయడం, సహజ నిక్షేపాలను అంతూ పొంతూ లేకుండా తవ్వడం వలన పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతింటుందని అన్నారు. ప్లాస్టిక్ చెత్త కూడా భూ కాలుష్యానికి ప్రధాన కారణమన్నారు. కాలుష్యం కారణంగా దుమ్ము, ధూళి వలన గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయి క్యాన్సర్, ఆస్తమా, గుండె జబ్బులకు పలువురు గురవుతున్నారని అన్నారు. దీన్ని అధిగమించడం కోసం విలువైన భూ వనరులను పరిమితంగా వాడుకోవడంతో పాటు విరివిగా మొక్కలు నాటి అవి పెరిగే వరకు సoరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ సంచుల స్థానే గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. రసాయనిక ఎరువులను వినియోగించకుండా కంపోస్టు, జీవ ఎరువులను వినియోగించాలని సురేఖ తెలిపారు. అనంతరం బుర్రకథ దళంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొక్కలు, గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ , రేలంగి బాపిరాజు , మల్లీశ్వరి , ఓం నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు.