విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
తాను ఇసుక అక్రమాలకు పాల్పడినట్టు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పదే పదే ఆరోపిస్తున్నారని, వాస్తవంగా తాను ఎలాంటి తప్పు చేయనప్పటికి అధికారులే తనపై తప్పుడు కేసులు బనాయించారని మండపేట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వైసీపీ నేత సయ్యద్ రబ్బానీ పేర్కొన్నారు. మండపేట విజయలక్ష్మి నగర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తాను కేవలం తవ్వకందారున్ని మాత్రమేనని, మైన్స్ అధికారులు ఎలా చెబితే అలా తవ్వకాలు సాగించామని పేర్కొన్నారు. ఇందులో తాను చేసిన తప్పు ఏముందని ప్రశ్నించారు. అధికారులే తప్పుడు కేసులు బనాయించారని, దీనిపై తాను కోర్టులో పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీ నాయకుడిగా, ప్రధాన అనుచరుడిగా ఉన్న మీపై అధికారులకు తప్పుడు కేసులు బనాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని రబ్బానీని మీడియా ప్రశ్నించగా తానేమీ నాయకుడిని కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో పలువురిపై 116 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ ఇసుక డబ్బులు తానే స్వయంగా తీసుకువెళ్లి కుమార్ బాబు కి ఇచ్చే వాడినని తెలిపారు. అక్రమ డబ్బులు ఇచ్చేటప్పుడు తప్పు చేస్తున్నట్టు మీకు అనిపించలేదా అని మీడియా ప్రశ్నించగా తాను ఒక వ్యాపారినని, ఎక్కడ తక్కువకు వస్తే అక్కడ నుండి తెచ్చుకుంటానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సలాది వీరబాబు, ముమ్మిడివరపు బాపిరాజు, పలివేల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.