విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
శంఖవరం, ఏప్రిల్ 28, (విశ్వం వాయిస్ న్యూస్) :
ఈ నెల 30వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడ బోతోంది. ఈ సంవత్సరంలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది కాస్తా
శనివారం రాబోతోండటం భారత దేశంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ మతం ధర్మ శాస్త్రాల ప్రకారం వేద పండితులు దీన్ని అశుభంగా పరిగణిస్తున్నారు. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుంటుందని చెబుతున్నారు. దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని సూచిస్తోన్నారు.
శని అమావాస్య నాడే సూర్యగ్రహణం ….
__________________________
హిందూ ధర్మ శాస్త్రాల్లో అమావాస్యకు, శనివారానికీ చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజును శని అమావాస్య లేదా శనిశ్చరీ అమావాస్యగా పిలుస్తుంటారు. కొన్ని చోట్ల అమావాస్య రోజున పాలు కూడా కొనరు. శనివారం నాడు వంట నూనె ఆధారిత వస్తువులను తీసుకోరు. ఇప్పుడీ రెండింటితో కలిసి సూర్యగ్రహణం రాబోతోంది. ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఇదే. ఇది పాక్షిక సూర్యగ్రహణం. అయినప్పటికీ ఇది
కొన్ని రాశులపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.
నాలుగు గంటలపాటు …
________________
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. భారత్‌లో ఈ సూర్యగ్రహణం అర్ధరాత్రి 12:15 నిమిషాలకు ఆరంభ మౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్ల వారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తిగా ఆ ఛాయ తొలగి పోవడానికి దాదాపు మరింత సమయం తీసుకుంటుంది.
భారత్‌లో కనిపిస్తుందా..?
________________
భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ – పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్య గ్రహణాన్ని వీక్షించ గలరు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియా నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తెలిపింది. నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నది.
ఏ ఏ రాశులపై ప్రభావం …
___________________
శని, అమావాస్య, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం… మూడు రాశులపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. మేషం, కర్కాటకం, ధనస్సు రాశుల వారిపై దీని దుష్ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషిస్తోన్నారు. గ్రహణ ప్రభావంతో వారికి అనారోగ్యం, మానసిక ఒత్తిడి సంభవించే అవకాశం ఉందని, ధన నష్టం కలుగు తుందని జోస్యం చెబుతోన్నారు. చేయాలి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాలేక పోవచ్చనీ అంచనా వేస్తోన్నారు. వ్యాపార రంగంలో ఉన్న వారు ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరింత శ్రమపడాల్సి ఉంటుందని పండితులు అంచనా వేస్తోన్నారు. మేష రాశి వారు మానసికంగా అశాంతికి గురవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని పండితులు స్పష్టం చేస్తున్నారు. గ్రహణ కాలంలో ఈ మూడు రాశుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట కూడదని, దీనికి విరుద్ధంగా వెళ్తే తుది ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయని హితబోధ చేస్తోన్నారు.