సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం విశ్వం వాయిస్ న్యూస్: ఆక్వా రంగంలోనూ మాఫియా జడలు విప్పుతోంది. చట్టాన్ని చెరువుల పాలే్జస్తోంది. అక్రమం ఆ గట్లపై వికటాట్టహాసం చేస్తోంది. చేలను చటుక్కున మాయం చేసేస్తోంది. రాత్రికి రాత్రి చేపల చెరువుల్ని పుట్టిస్తోంది. అమాయక రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకుని లీజు పేరిట వందలాది ఎకరాల పంట భూముల్ని హస్తగతం చేసుకుంటున్న ఆక్వా మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులుగా మార్చేస్తోంది. చేలను చెరువులుగా మార్చేందుకు కనీసం దరఖాస్తు చేయకుండా దందా సాగిస్తోంది. కాసులు మరిగిన అధికారులు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో.. ఆ చెరువుల సమీపంలో వరి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. చివరకు తమ భూములనూ ఆక్వా మాఫియాకు అప్పగించాల్సి వస్తోంది. డెల్టా ప్రాంతంలో ఆక్వా మాఫియా రాజ్యమేలుతోంది. మండపేట నియోజకవర్గాల్లో చాపకింద నీరులా ప్రవహిస్తూ వరి చేలను చేపలు చెరువులుగా మార్చేస్తోంది. అక్రమాల పంజా విసిరి రైతుల్ని వలలో బిగిస్తోంది. రెండు పంటలూ పండే భూములను హస్తగతం చేసుకుని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తొలుత సారవంతమైన భూముల మధ్య నాలుగైదు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకోవడం.. అందులో చేపలు లేదా రొయ్యల చెరువు తవ్వడం చేస్తున్నారు. పొలాల మధ్యలో చెరువు తవ్వడం వల్ల అందులోంచి వచ్చే కలుషిత నీటివల్ల దాని చుట్టుపక్కల భూముల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సాకుగా తీసుకుని సమీపంలోని పొలాలన్నిటినీ లీజుకు తీసుకుని 10నుంచి 50 ఎకరాలను ఒకే ప్లాటుగా చేసి చెరువులు తవ్వుతున్నారు.
చెరువు తవ్వకాల వద్ద గ్రామస్తులు అందోళన:
కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో నివాస స్థలాలకు అనుకొని పంట పొలాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వకాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు . వివరాల్లోకి వెళితే రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో స్థానిక సీతంపేట కు ఆనుకుని ఉన్న వరి సాగు పంట పొలాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు మొదలు పెట్టారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నివాస స్థలాలకు దగ్గర గా కోళ్ల ఫారం, రైస్ మిల్, ఇటుక బట్టీలు ఉండటంతో వాటి వలన ఏర్పడే దుర్గంధం, దుమ్ము, ధూళితో పిల్లలు పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారనీ , దానికి తగ్గట్టుగా నివాస స్థలాలుకు దగ్గరగా అక్రమంగా రొయ్యల, చేపల చెరువులు తవ్వకాలు మొదలు పెట్టారని, దీనిపై గ్రామస్తులు చేను గల రైతును వివరణ కోరగా…రైతు నా చేను నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటాను అని సమాధానం ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు చెరువులు తవ్వకాలు జరిగే ప్రదేశానికి చేరుకొని ఆందోళనలు నిర్వహించి తవ్వకం పనులను అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో గ్రామస్తులు మీడియాతో తమ బాధను చెబుతూ మాట్లాడుతూ సోమేశ్వరం గ్రామపంచాయతీ సీతంపేట గ్రామం లో ఉన్న పంట పొలాల్లో చేపలు రొయ్యల చెరువులు తవ్వి వాటిని పెంచడానికి నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. అయితే చేపలు పెంచడం వల్ల వాటి కోసం వాడే రసాయనాలు, ఎరువులు, వ్యర్థాల వల్ల వచ్చే దుర్వాసన వల్ల మాత్రమే కాకుండా తాగునీరు, కలుషితమై తద్వారా సీతంపేట గ్రామ ప్రజలు పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, పాడి పంట పొలాలు కూడా పాడవే పరిస్థితి కూడా ఉందని గ్రామ ప్రజలు ఆవేదన చెందారు. సీతంపేట లో ఉన్న కోళ్ల ఫారం ద్వారా వచ్చే దుర్వాసన, వ్యర్ధాలు, ఈగల ద్వారా ఇళ్లల్లోకి చేరి గాలి, ఆహారం, త్రాగు నీరు కలుషితం అవుతుంది. అంతే కాకుండా గ్రామంలో వున్న ఇటుక బట్టిలు ద్వారా వచ్చే బూడిద వలన గాలి, ఆహారం, త్రాగు నీరు కలుషితం అవుతుందని గ్రామస్తులు తమ ఆవేదనను తెలియజేశారు.
ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి:
గనులు, భూగర్భ వనరుల శాఖ నిబంధనల ప్రకారం ఎలాంటి మైనింగ్ చేయాలన్నా.. ముందుగా స్థానిక తహశీల్దారు ఎనఓసీ ఇవ్వాలి. ఆ ఎనఓసీ మేరకు లీజుదారుడు దరఖాస్తు చేసుకున్న విస్తీర్ణంలో మైనింగ్ చేసుకోవడానికి గనులు, భూగర్భ వనరుల శాఖ అనుమతి ఇస్తుంది. అనుమతిచ్చిన ప్రదేశంలోనే మైనింగ్ చేయాలి. మైనింగ్ లీజుతో పాటు తవ్విన ఎర్రమట్టికి క్యూబిక్ మీటరుకు రూ.65లు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 16 క్యూబిక్ మీటర్ల టిప్పరుకు సుమారు రూ.1,040 ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలి. సోమేశ్వరం లో రోజుకు 15-20కి పైగా టిప్పర్లతో ఎర్రమట్టి తోలుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఒక టిప్పరు రోజుకు సగటున 10-15 ట్రిప్పులకు పైగా తోలుతుందని అంచనా. రోజూ 250-300 ట్రిప్పలు తోలుతున్నట్లు సమాచారం. రాయవరం, సోమేశ్వరం గ్రామాల్లో సుమారు 50 వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి అక్రమ తవ్వకాలు చేశారని అంచనా. బహిరంగంగా క్యూబిక్ మీటరు రూ.175-250 లకు పైగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ.1.25 కోట్ల విలువైన మట్టిన తరలించినట్లు తెలుస్తోంది. రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖాజానాకు రూ.35 లక్షలకు పైగా గండికొట్టినట్లు సమాచారం. రెవిన్యూ, మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేస్తే భారీగా అక్రమ తవ్వకాల గుట్టు వెలుగులోకి వస్తుందని స్థానికులు అంటున్నారు.
అక్రమ మట్టి తవ్వకాలు నిలిపివేసిన అధికారులు:
దీనిపై గ్రామ పంచాయతీని వీఆర్వో ను దేవి ని, మండల తహసీల్దార్ కే జే ప్రకాష్ బాబు ను వివరణ కోరగా తమ వద్దకు అనుమతుల కోసం ఎవరూ రాలేదని అన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది సంఘటన ప్రదేశం వద్దకి చేరి చేనుగల రైతును అధికారులు వివరణ కోరగా నా పంట పొలంలో వాటర్ టెస్టింగ్ చేయించుకుంటున్నానని సమాధానం ఇచ్చారు. అందుకు మండల రెవెన్యూ ఇన్చార్జ్ ఆర్ ఐ అర్జమ్మ మాట్లాడుతూ నీటి పరిశోధన చేయించుకోవడానికి అనుమతులు తీసుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. తక్షణమే ఇక్కడ నుండి బోర్ వెల్ తరలించాలని, లేనిచో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల ఆదేశాల మేరకు గ్రామస్తులు పంట పొలాల లో నుండి బోర్వెల్ మిషన్లు తీసేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని ప్రజలు నినాదాలు చేశారు. దీనిపై రెవిన్యూ డిపార్ట్మెంట్ రేపు ఉదయం 10 గంటల లోపు మిషనరీని తీయించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.
తాసిల్దార్ కు గ్రామస్తులు వినతి :
రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో నివాస స్థలాలకు అనుకొని పంట పొలాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వకాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు . మండలం సోమేశ్వరం గ్రామంలో స్థానిక సీతంపేట కు ఆనుకుని ఉన్న వరి సాగు పంట పొలాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు మొదలు పెట్టారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నివాస స్థలాలకు దగ్గర గా కోళ్ల ఫారం, రైస్ మిల్, ఇటుక బట్టీలు ఉండటంతో వాటి వలన ఏర్పడే దుర్గంధం, దుమ్ము, ధూళితో పిల్లలు పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారనీ , దానికి తగ్గట్టుగా నివాస స్థలాలుకు దగ్గరగా అక్రమంగా రొయ్యల, చేపల చెరువులు తవ్వకాలు మొదలు పెట్టారని, దీనిని వెంటనే ఆక్వా చెరువు తవ్వకాలు నిలిపివేయాలని కోరుతూ తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు కివినతి పత్రం అందిచారు.