సిఐటియు ఆధ్వర్యంలో మార్క్స్ 204 జయంతి
సందర్బంగా జరిగిన సదస్సులో వక్తలు…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ, మే6; సమసమాజ నిర్మాణ సిద్ధాంత కర్త, సహస్రాబ్ది మహా మేధావిగా పేరు గాంచిన కార్ల్ మార్క్స్ 204 వ జయంతి సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మార్క్స్ రచనలను నేటితరం అధ్యయనం చేయాలన్నారు.
గురువారం సాయంత్రం స్థానిక యుటిఎఫ్ హోం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె. సత్తిరాజు అధ్యక్షతన సదస్సు జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నేత డా. సి.స్టాలిన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రకృతిలో జరిగే మార్పులను మానవ సమాజానికి అన్వయించి గతితార్కిక, చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని రూపొందించారని పేర్కొన్నారు. కార్మిక వర్గ నాయకత్వంలో సమసమాజ స్థాపన జరుగుతుందని మార్క్స్ చెప్పిన సూత్రీకరణ చాలా ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మార్క్స్ రచనలను నేటితరం అధ్యయనం చేయాలన్నారు.
ముఖ్య వక్తగా విచ్చేసిన ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ.వి. మార్క్స్ జీవితము – కృషి అనే అంశంపై మాట్లాడారు. జెర్మనీ లో ప్రష్యాలో జన్మించిన మార్క్స్ యువకుడు గా ఉండగా ఏ వృత్తి చేపడితే సమాజానికి ఉపయోగమో అని ఆలోచించారంటే ఆయన గొప్పతనం అర్ధం చేసుకోవచ్చన్నారు. ముగ్గురు బిడ్డలు మరణించినా , కటిక పేదరికం అనుభవించిన ఆయన కృషి ఆగలేదన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం దేశాలు బహిష్కరించగా లండన్ లో ఉండి ప్రపంచ పరిణామాలను, కార్మిక ఉద్యమాలను పరిశీలించారని పేర్కొన్నారు. సిద్ధాంతం చెప్పడమే కాకుండా స్వయంగా కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచ ప్రజలపై చెరగని ముద్ర వేసిన మార్క్స్ సిద్ధాంతాన్ని, రచనలను అధ్యయనం చేయాలన్నారు.
సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ తత్వశాస్త్రం, విప్లవాల చరిత్ర, రాజకీయ అర్ధశాస్త్రం కలయికే మార్క్సిజమని పేర్కొన్నారు. మార్క్స్ ఎంగెల్స్ ఇరువురూ కలిపే కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసారని, తదుపరి పెట్టుబడి రచన ద్వారా దోపిడీ గుట్టు రట్టు చేయడం జరిగిందన్నారు. 1871 లో జరిగిన పారిస్ కమ్యూన్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతానికి ఆచరణ రూపం ఇచ్చిందన్నారు. తదుపరి అక్టోబర్ విప్లవం ప్రపంచంపై సోషలిజం విశిష్టతను చాటిందన్నారు. ప్రస్తుతం చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తరకొరియా, లావోస్ దేశాలు సోషలిస్టు మార్గం లో పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో, వివిధ దేశాల్లో అసమానతలు పెరిగిపోతున్న నేటి తరుణంలో మార్క్స్ ప్రాధాన్యత చాలా ఉందన్నారు. అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, బుద్ధిష్ట్ వివి సత్యనారాయణ మూర్తి తదితరులు మాట్లాడుతూ భారత దేశంలో సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు, అభ్యుదయ వాదులు, సామాజిక న్యాయం కోరుకునే వారంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు సదస్సు కు ఆహ్వానం పలికి వందన సమర్పణ చేస్తూ శ్రమకు పట్టం కట్టిన మార్క్స్ ధన్యజీవి అని కొనియాడారు.
ఈ సందర్భంగా దుర్గాదేవి ఆలపించిన శ్రమజీవే జగతికి మూలం అనే గీతం అలరించింది. ఈ కార్యక్రమంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబి రాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలక వెంకట రమణ, జిల్లా కార్యదర్శి నూకల బలరాం, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ, నగర నాయకులు సి. వెంకట్రావు, చరణ్, కె. సత్తిబాబు లతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు దుంపల ప్రసాద్, పివిఎన్ గణేష్, కెవి రమణ, సిహెచ్. సత్యనారాయణ రాజు, వేణు, నాగలక్ష్మి, కెఎన్ రాజు, జి. వర్మ, కెఎంఎంఆర్ ప్రసాద్, వి. సోనీ, తురగా సూర్యారావు, గౌరునాయుడు, నేతల నూకరాజు, బాషా, రవి, ప్రసాదబాబు తదితరులు పాల్గొన్నారు….