విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్: అసని తుపాన్ మూలంగా బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా వుండి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టం గావించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కోస్తా తీరం వెంబడి ఉన్న ఏడు జిల్లాల కలెక్టర్లతో అసని తుఫాను హెచ్చరికల నేపద్యంలో చేపట్టాల్సిన అప్రమత్తత, రక్షణ సహాయక చర్యలను గూర్చి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు సంభవించినట్లైతే ముంపు బాధితుల పట్ల మానవతావాదాన్ని చాటాలని సూచించారు. సహాయ చర్యలకు నిధులు విడుదల చేశామని తుఫాన్ ప్రభావం కూడా కొంత మేర బలహీన పడిందని అయినప్పటికీ కోస్తా తీరం వెంబడి ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ సముద్రం లోనికి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో తుఫాను సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి రక్షణ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. వర్షపాతం నమోదు ఆధారంగా పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరిని సురక్షిత ప్రాంతాలకు, తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సమాయత్తం కావాలన్నారు. గుర్తించిన పునరావాస కేంద్రాలు, తుఫాను షెల్టర్లు ముంపు బాధితులకు వసతి, భోజన సదుపాయాలు ముంపు నీరు తగ్గే వరకు కల్పించి తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ముంపు బాధిత ఒక్కో వ్యక్తికి రూ.1000/- , కుటుంబానికి రూ.2000/-లు ఆర్థిక సహాయం అందించాలన్నారు. ముంపు బాధితులు ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా రక్షణ, సహాయక చర్యలు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. జిలా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ రహాదారులు భవనాల శాఖ జేసిబిలు, పవర్ రంపాల వంటి సామాగ్రితో సిద్ధంగా ఉండి చెట్లు పడిపోయిన యెడల రహదారి మార్గాలను పునరుద్ధరించాలన్నారు. ట్రాన్స్కో అధికారులు అసని తుఫాను ప్రభావంతో విద్యుత్ స్తంభాలు దెబ్బ తిన్నట్లయితే వాటి స్థానే కొత్త స్తంభాలు వేసి విద్యుత్ పునరుద్దరణకు సర్వ సన్నదం కావాలని ఆదేశించారు. అగ్నిమాపక విపత్తుల స్పందన ఎండిఆర్ ఎఫ్, ఎస్బిఆర్ ఎఫ్ బృందాలు సముద్ర తీరం వెంబడి ఉన్న ఏడు మండలాలలో రక్షణ, సహాయక చర్యలు సమన్వయంతో చేపట్టేందుకు సిద్ధం కావాలని సూచించారు. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ త్రాగునీటి వనరుల వద్ద జనరేటర్లు, డీజిల్ నిల్వలతో సమృద్దిగా త్రాగునీరు సరఫరా చేసేందుకు సమాయత్తం కావాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ఈ వారంలో ప్రసవాలు నిర్వహించుకునే గర్భిణీలను 32 మందిని గుర్తించి సురక్షిత ఆసుపత్రి ప్రసవాలు నిర్వహించుకొనేలా చర్యలు తీసుకోవడం జరిగిందని వీరిలో కాన్పు ప్రమాదకరంగా భావించిన ఇద్దరిని ప్రసవాలను నిర్వహించుకొనేలా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. కోనసీమ జిల్లాలో 37 సైక్లోన్ సెంటర్లు, 30 సీపీడబ్ల్యూఎస్ త్రాగునీటి స్కీమ్ లతోపాటు 40 కమ్యూనికేషన్ టవర్లు ఉన్నాయని జిల్లా కేంద్రంలో కమాండ్ అండ్ కంట్రోల్, ఏడు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని ఎవరికైనా అసని తుఫాను ప్రభావంతో ఏ విధమైన కష్టం వచ్చినా కంట్రోల్ రూంలకు గాని ఉన్నత అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన స్పష్టం చేసారు. తుఫాను షెల్టర్లు, పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ముంపు బాధితుల ఆరోగ్య పరిరక్షణకు సహాయ పడాలన్నారు. వ్యవసాయ అధికారులు వరి, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్లయితే నష్ట పరిహారాలు అంచనా వేసేందుకు సిద్ధం కావాలన్నారు. గృహ నిర్మాణ సంస్థ అధికారులు అసని ప్రభావంతో గృహాలు దెబ్బతిన్నట్లైతే వాటి అంచనాలు గణించేందుకు సమాయత్తం కావాలన్నారు. జిల్లా యంత్రాంగం ముంపు బాధితుల అప్రమత్తత రక్షణ సహాయక చర్యలకు సూక్ష్మ స్థాయిలో ప్రణాళికాయుతంగా 24/7 పనిచేసి ముంపు బాధితులకు భరోసాగా నిలవాలన్నారు. క్షేత్రస్థాయి నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు సహాయక చర్యలపై సిబ్బంది సిద్ధం అవుతూ అన్ని రకాల లాజిస్టిక్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పౌర సరఫరాల అధికారులు నిత్యావసరాలు, పాలు తుపాను సమయంలో కొరత లేకుండా చూడడంతో ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పురపాలక సంఘంలో ఉన్న 130 మంది సిబ్బందిని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ద్యం కొరకు వినియోగించుకొనే వెసులుబాటు ఉందన్నారు. జిల్లాలో 29 వేల ఎకరాల్లో రబీ వరి సాగు ఉందని దీనిలో కొద్దిమేర మాత్రమే రైతులు కోతలు నిర్వహించారని మిగిలిన పంట పంట పొలాల్లోనే ఉందని ఆయా పంట పొలాల్లో నీరు నిల్వ లేకుండా ధాన్యం రంగు మారకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఆర్భికేల ద్వారా రైతులకు సూచలను ఇవ్వాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలు మండలానికి ఒకటి రెండు చొప్పున ప్రారంభించి ఆహార భద్రతకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల స్పందన శాఖ సూచనలు అందరూ పాటించాలని ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర హెచ్ ఎం, జిల్లా ఎస్పీ కెఎస్ ఎస్ వి సుబ్బారెడ్డి, డిఆర్వో సిహెచ్. సత్తిబాబు, ఆర్దబ్ల్యూఎస్ ఎస్ ఈ కృష్ణా రెడ్డి, పీఆర్ ఎస్ ఈ చంటిబాబు, ట్రాన్స్కో ఎస్ ఈ పి ఎస్ ఎం మూర్తి, డిసిహెచ్ ఎస్ పద్మశ్రీ రాణి, డిఎం అండ్ హెచ్ఓ భారతి లక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీనివాస్ నాయుడు, ఫిషరీష్ జెడి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ డిఎం తనుజా, పశు సంకవర్ధక శాఖ జేడీ జైపాల్, వ్యవసాయ శాఖ జేడీ ఆనంద్ కుమారి, జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ అధికారి కె.లక్ష్మి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.