విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
మండపేట మండలం కేశవరం గనిపోతురాజు చెరువు వద్ద జరుగుతున్న మట్టి తవ్వకాలను స్థానిక దళిత నాయకులు అడ్డుకున్నారు. తరతరాలుగా ఈ చెరువును అనుకుని అనేక దళిత కుటుంబాలు సాగు చేసుకుని బ్రతుకుదేరువు సాగిస్తున్నాయని, అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్యాయంగా తమ పొట్ట కోడుతున్నారని ఆరోపించారు. కాగా అది పూర్తిగా చెరువు భూభాగమని, అక్కడ పంటలు పండించుకునే అధికారం ప్రజలకు లేదని అధికారులు వాదిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి మొత్తం స్థానిక దళితులంతా చెరువు వద్దనే ఉండిపోయారు. వీరికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతుగా నిలిచి తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాగా ఓ దశలో పోలీసులు వారిని అరెస్టు చేస్తామంటూ బెదిరింపు లకు పాల్పడ్డారు. అయినప్పటికీ అక్కడివారు తమకు న్యాయం చేసేవరకూ పోరాటాన్ని ఆపేది లేదంటూ బీస్మించుకుర్చున్నారు. ఇప్పటి వరకు కేశవరం లో అనేక పార్టీలకు చెందిన నాయకులు కొండలు, గుట్టలు తవ్వుకుపోయారేమో గానీ తమ దళితుల భూముల జోలికి ఎవ్వరూ రాలేదని, మొదటి సారిగా వైసీపీ నాయకులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొట్ట కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. పరిమితికి మించి తవ్వకాలు సాగించడంతో పాటు యూనిట్ కు ఒక రూపాయి చొప్పున లారీ మట్టికి ప్రభుత్వానికి కేవలం 10 రూపాయలు లోపు చెల్లించి వాటిని వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అదే విధంగా ఈ మట్టిని చెరువు గట్టు అభివృద్ధికి మాత్రమే వినియోగించాల్సి ఉన్నప్పటికీ వాటిని వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. మొదటి నుండి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు దళితులంటే పడదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.