* హాజరైన నాలుగు మండలాల పార్టీ శ్రేణులు
* ఈ సభకు స్థానిక ఇద్దరు విలేఖర్లకే ఆహ్వానం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కత్తిపూడి:
శంఖవరం, మే 24, (విశ్వం వాయిస్ న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ఐతే ఈ పర్యటనలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతూ ఉన్నారని ఆరోపిస్తూ పాలక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్నీ నిజాలను చెప్పేందుకే అంటూ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది.
ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మే 26 నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ‘బస్సు యాత్ర’ ప్రారంభించ నున్నట్లు ప్రకటించింది. ఈ నేపధ్యంలో బహుజనులకు చేకూరిన ప్రయోజనాన్ని ప్రజలు అందరికీ చాటి చెప్పేందుకు ” సామాజిక న్యాయభేరి – జయహో జగనన్న” నినాదంతో ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టామని, దీనిని జయప్రదం చేయాలని అధికార పార్టీ ఇప్పటికే పిలుపు నిచ్చింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లలోనే సామాజిక విప్లవం సృష్టించారని, ఇది దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయమని అభివర్ణించడానికి, పెరియార్ ఇ రామస్వామి, జ్యోతీరావ్ ఫూలే, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రాం, అబుల్ కలాం ఆజాద్, కొమరం భీమ్ వంటి మహామహుల ఆలోచనలను సీఎం ఆచరించి చూపుతున్నారని కొనియాడడానికి ఈ బస్సు యాత్ర లక్ష్యాన్ని నిర్దేశించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతోందని సీఎంకు ప్రచారంలో పెద్ద పీట వేసేందుకు నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్రలో భాగంగా 26 న విజయనగరం, 27 న రాజమండ్రి, 28 న నరసరావుపేట, 29 న అనంతపురంలో బహిరంగ సభలు జరుగ నున్నాయి. జగన్ సీఎంగా ఈ నెల 30 వ తేదీకి ప్రభుత్వానికి సరిగ్గా మూడేళ్ళు నిండుతాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ బస్సు యాత్ర ద్వారా సామాజిక న్యాయ భేరీని మోగిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, ముఖ్యంగా టీడీపీ హయాంలో జరిగిన సామాజిక అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు, గడిచిన మూడేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని కింది స్థాయి వరకూ చాటి చెప్పేందుకూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ముఖ్యంగా బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంకిత భావాన్ని తెలియ జేయడానికి నాలుగు రోజుల పాటు ఈ యాత్రను నిర్వహించ నున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక న్యాయ సందేశాన్ని కూడా ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. జగన్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగు తున్నదని, రాష్ట్రంలో రెడ్డి రాజ్యం మాత్రమే కొనసాగు తున్నదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న సమయంలో, ఆ విమర్శలకు చెక్ పెట్టడానికి సామాజిక న్యాయభేరి జరుగు తున్నదన్నది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలిసిన సత్యమే.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో బస్సు యాత్ర పరిధిలోకొచ్చే ప్రాంతాలు అన్నిటా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేల నేతృత్వంలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని నెల్లిపూడి రోడ్డులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ నేతృత్వంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు నియోజక వర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మడలాల పార్టీ శ్రేణులకు బైక్ ర్యాలీ, సభా నిర్వహణ, విజయ వంతం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 27 న ఉదయం ప్రత్తిపాడు నియోజక వర్గం అన్నవరం గ్రామంలోనికి యాత్ర ప్రవేశిస్తుందని, దానికి ఘనంగా స్వాగతం పలకాలని, మధ్యాహ్నం 1 గంట సమయానికి బస్సు యాత్ర కత్తిపూడికి చేరు కుంటుందని, సుమారు 15 నిమిషాలు నేతల ప్రసంగం ఉంటుందని, ఈ కార్యక్రమం విజయం వంతంనకు నియోజవర్గం మొత్తం మీద పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అన్నవరం చేరుకున్న ప్రజలకు స్థానిక గౌరీ కల్యాణ మండపంలోనూ, కత్తిపూడి చేరుకున్న వారికి స్థానికంగానూ మధ్యాహ్నం భోజనాలను ఏర్పాటు చేస్తామని, అన్నవరం నుంచీ కత్తిపూడి మీదుగా యర్రవరం వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, యర్రవరం దాటడంతో నియోజ వర్గంలో బస్సు యాత్ర ముగుస్తుందని, ఏలేశ్వరం, భద్రవరం, లింగంపర్తి, ఉత్తరకంచి, శాంత్రిఆశ్రమం గ్రామాల మీదుగా బైక్ ర్యాలీగా శంఖవరం, రౌతులపూడి మండలాల ప్రజలు తిరిగి వెనక్కి వస్తారని కార్యక్రమ ప్రణాళికను ఎమ్మేఎల్యే వివరించారు. ఆయా మండలాల నుంచి కార్యక్రమ సన్నాహక బాధ్యతలను పార్టీ మండల స్థాయి నేతలకు ఎమ్మెల్యే అప్పగించారు. పలువురు పాల్గొన్నారు.