విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ : ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ నగర పాలక సంస్థ నిర్వహణలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలు ఆస్తులతో సహా విద్యాశాఖకు బదిలీని కార్పొరేషన్ పాలక వర్గం పార్టీలకు అతీతంగా వ్యతిరేకించింది.ఈమేరకు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.కార్పొరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం సోమవారం సాయంత్రం నగర పాలక సంస్థ పాత కార్యాలయంలో మేయర్ సుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగింది.2తీర్మానాలు ప్రవేశ పెట్టారు.కాకినాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 67మునిసిపల్ పాఠశాలలు ఉండగా, సుమారు 20వేల మంది విద్యార్థులు,600మంది బోధన, బోధనేతర సిబ్బంది వున్నారు.విద్యార్థులు,బోధన బోధనేతర సిబ్బంది బదిలీకి అభ్యంతరం లేదని, ఆస్తుల బదలాయింపు వ్యతిరేకిస్తున్నామని కౌన్సిల్ తీర్మానం చేసింది.ఈమేరకు తీర్మానం ప్రతిని ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. అలాగే నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని తీర్మానం చేసి ఆమోదించారు.ఇందుకు కార్పొరేషన్ సాధారణ నిధులు కోటి రూపాయలు,15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.4 కోట్ల73లక్షల సీఎస్ఆర్ నిధులు ,25లక్షలు వెచ్చించాలని తీర్మానించారు. కార్యక్రమంలో కమిషనర్ కె.రమేష్,డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ కుమార్, ఆదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహా రావు, కార్పొరేటర్లు,కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.