విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి సోమవారంతో మూడేళ్లు పూర్తైన సందర్భంగా అధికార వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సోమవారంతో మూడేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఏజెన్సీ వ్యాప్తంగా వైకాపా శ్రేణులు వాడవాడలా సంబరాలు చేసుకున్నారు. ఎటపాక మండల వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎటపాక హెడ్ క్వాటర్లో గల రాజుపేట కాలనీలోని వైయస్సార్ విగ్రహానికి ముందుగా నాయకులు పాలాభిషేకం నిర్వహించి వైకాపా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రిప్రగడ నరసింహరావు , మండల సొసైటీ అధ్యక్షులు ఆకుల వెంకటరామారావు (పెద్దోడు) మాట్లాడుతూ వైకాపా ప్రజా విజయానికి మూడేళ్లు పూర్తి అయ్యిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా జగన్ 96 శాతం అమలు చేశారని వారు ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు ప్రభుత్వం , సామాజిక న్యాయభేరి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. సుపరిపాలనతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో మంచి సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారని నేతలు కొనియాడారు. జగన్ నవరత్నాల పేరిట పేద , బడుగు , బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని నేతలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం మరలా జగన్ సీఎం అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎటపాక జెడ్పీటిసి ఉబ్బ సుస్మిత , ఎంపిపి కాక కామేశ్వరి , వైకాపా జిల్లా కార్యదర్శి కొవ్వూరు రాంబాబు , వైకాపా జిల్లా నాయకులు కురినాల వెంకట్ (బుజ్జి) , గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి , డేగల రామక్రిష్ణ , శీలం కృష్ణ , మాచర్ల బాబూరావు , ధనపాల కుమార్ , మోతుకూరి రాంప్రసాద్ , బర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.