Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జగనన్న కాలనీల్లో రాబందులు…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పేదల బేస్మెంట్ మెటీరియల్ స్వాహా..
హౌసింగ్ శాఖ అక్రమ అ లీలలు..
కానరాని పురోగతి…
లబోదిబో మంటున్న లబ్ధిదారులు..

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

మండపేట విశ్వం వాయిస్ న్యూస్

మండపేట: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహ నిర్మాణ పథకంలో రాబందులు వచ్చి పడ్డాయి. దీంతో పాటు గృహ నిర్మాణశాఖలో దశాబ్దంన్నరకు పైగా అసిస్టెంట్ ఇంజనీరుగా తిష్ట వేసిన ఓ అధికారి ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఈయనకు తోడు కొందరు అక్రమార్కులు జత కట్టడంతో వీరంతా ముఠాగా ఏర్పడి దోపిడీకి తెరతీశారు. జగనన్న గృహ నిర్మాణ పథకం కింద కట్టే ఇళ్లను కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. వీరికి హౌసింగ్ శాఖలో ఏనాటి నుండో అవినీతి రాజ్యమేలుతున్న అధికారి, ఆ నలుగురికి అండగా నిలవడంతో వేములపల్లి కాలనీ ఇళ్ల పేరుతో భారీ స్కాంకు స్కెచ్ వేశారు. తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఒకరికొకరు సహకరించుకుంటూ కాసులు కూడబెట్టుకున్నట్టు కాలనీ వాసులు గుసుగుసలాడుకుంటున్నారు . జగనన్న గృహ నిర్మాణ పథకం ద్వారా ఏడాది క్రితం ఎంతో అట్టహాసంగా శంఖుస్థాపనలు జరిగాయి.

 

భారీ బహిరంగ సభలో ఇళ్లన్నీ పూర్తి చేసి త్వరలోనే పేదోడి సొంతింటి కల నెరవేరుస్తామని నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు సైతం ఇచ్చారు. భూమిపూజ చేసిన దరిమిలా లబ్ధిదారులకు ప్రతి ఇంటికీ రూ. 1.80 లక్షలు రుణం ప్రభుత్వమే మంజూరు చేస్తుందని, అలా కాని పక్షంలో ఒక్కో ఇంటికీ అవసరమైన మెటీరియల్ ను ప్రభుత్వమే అందజేస్తుందని చెప్పిన విషయం విధితమే. సరిగ్గా అప్పుడే ఇళ్ల పేరుతో దోపిడీకి భీజం పడింది. పైన పేర్కొన్న కాంట్రాక్టర్ల ముఠా, హౌసింగ్ అధికారి కుమ్మక్కై వారి వద్ద నుంచి 10 నుండి 20 ఆధార్ కార్డులు తీసుకుని ఒక్కో ఆధార్ కార్డుకు 20 స్లిప్పులు చొప్పున కాజేసినట్టు బహిరంగంగానే చెవులు కొరుక్కుంటున్నారు. ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు దశల్లో బిల్లులు రావాల్సి ఉండగా తొలి దశలో బేస్మెంట్ నిర్మించాల్సి ఉంది. బేస్మెంట్ ప్రారంభ దశలోనే ఒక్కో ఇంటికీ 40 సిమెంటు బస్తాలు,10 టన్నుల ఇసుక, కొంత ఐరెన్ ను ఇచ్చారు. అవి చేతికి అందే వరకూ గుంట నక్కల్లా ఎదురు చూసిన ముఠా ఆనక నల్ల బజారుకు తరలించి అయినకాడికి దండుకున్నారన్న ఆరోపణలు కాలనీలో చక్కెర్లు కొడుతున్నాయి. 110 ఎకరాల్లో 5166 ఇళ్ళు మంజూరు చేశారు. కనీసం అందులో 500 ఇళ్లకు బేస్మెంట్లు కూడా వేయకుండా పునాదులు పేరుతో అక్కడ దోచుకు పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ల పట్ల లబ్దిదారుల పట్ల నిబద్ధతతో వ్యవహరించాల్సిన హౌసింగ్ అధికారి అంతా దండుకుని ఇప్పుడు వారి మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని తన పబ్భం గడుపుకుంటారని పట్టణంలో కోడై కూస్తోంది.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా బేస్మెంట్లు మొదలు పెట్టిన వారికి మెటీరియల్ అందించడంలో గతం కంటే తగ్గించి ఇస్తామని చెబుతున్న మాటలు తమకు విడ్డూరంగా అనిపిస్తున్నాయంటూ కొంతమంది చెప్పడం గమనార్హం. కడతామని నమ్మించి సిమెంటు ఇసుక దోచుకు పోయినవారికి అరిటాకులో పెట్టి నిజాయితీగా పనిచేసే వారికి నేల మీద పెడతారా అంటూ ఆగ్రహావేసాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క అధికారులు మరో పక్క కాంట్రాక్టర్లు చేసిన వ్యవహారానికి మధ్యలో బలై పోతామేమోనని లబ్దిదారులు పెడుతున్న గగ్గోలు చర్చకు దారి తీసింది. కాగా హౌసింగ్ సంబంధిత గోదాముల్లో ఒక్క సిమెంటు బస్తా కూడా లేదని అవన్నీ ఏమై పోయాయో ఎవరి బేస్మెంట్ లోకి వెళ్ళాయో ఉన్నతాధికారులు విచారణ జరిపి తిరిగి రాబట్టాలని లబ్దిదారులు వేడుకుంటున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement