విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్:
వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, గృహ నిర్మాణం, ఇతర ప్రాధాన్య రంగాలకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) కింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా బ్యాంకర్లను కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ స్పందనహాల్‌లో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జిల్లా సలహా కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్‌సీ) సమావేశాలు జరిగాయి. కలెక్టర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలక్కియతో కలిసి
2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో బ్యాంకుల ద్వారా వివిధ రంగాలకు జరిగిన రుణ కేటాయింపులపై చర్చించారు. అదే విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్.. బ్యాంకర్లకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక కింద వ్యవసాయ రంగానికి రూ. 7,141 కోట్లు, ఎంఎస్ఎంఈ (ఎగుమతులు సహా) రంగానికి రూ. 2,195 కోట్లు, విద్యకు రూ. 75 కోట్లు, హౌసింగ్‌కు రూ. 458 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగ అడ్వాన్సులకు రూ. 265 కోట్లు వెరసి ప్రాధాన్య రంగానికి మొత్తం రూ. 10,134 కోట్లుగా రుణ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. నాన్ ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సులకు రూ. 3,656 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వివరించారు. వీటితో పాటు కౌలు రైతులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణ లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పీఎంఏవై (అర్బన్)-ఏపీ టిడ్కో రుణాల ప్రగతిని సమీక్షిస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు సవరించిన అంచనాల మేరకు వెంటనే రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు.
*త్వరితగతిన విద్యారుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలి: ఎంపీ వంగా గీత*
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ఆర్థిక ఎదుగుల లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రుణ దరఖాస్తుల పరిష్కారంలో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు చేయూతనందించాలన్నారు. లక్ష్యాల మేరకు టిడ్కో రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం సమర్పించే రుణ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించడం వల్ల ప్రవేశాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా పంట రుణాలను మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఇందుకు వ్యవసాయ అధికారులు.. బ్యాంకింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. రైతులు, కౌలు రైతులకు సంబంధించి వార్షిక రుణ లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ అధికారి పీఎం పూర్ణిమ, సమావేశ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) రీజనల్ హెడ్ కేఎన్‌వీ చిన్నారావు, ఎల్‌డీఎం ఎస్.శ్రీనివాసరావు, నాబార్డు ఏజీఎం వై.సోమునాయుడు, వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, మెప్మా పీడీ బి.ప్రియంవద, వివిధ బ్యాంకుల అధికారులు, సమన్వయ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.