విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )
అర్జీలపట్ల సానుకూలంగా స్పందించి నాణ్యతతో సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వ పనితీరుపట్ల విశ్వసనీయతను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సుమారు 55 మంది అర్జీదారులు తమ తమ సమస్యలను వ్రాత పూర్వకంగా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారించి నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకొని పూర్తిగా పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులందరూ సమయపాలన పాటించి విధులకు హాజరవుతూ , క్రింద స్థాయి సిబ్బంది సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విధులకు గైహాజరవుతున్నట్లు ప్రజల నుండి పిర్యాదులు అందుతున్నయని,
జిల్లా అధికారుల పనితీరు మెరుగుపర్చుకుని అంకితభావం జవాబుదారీతనంతో పనిచేయాలని ఇకపై అధికారులపై పిర్యాదులు వచ్చిన పక్షంలో కఠినచర్యలు గైకొనడం జరుగుతుందని హెచ్చరించారు. ఈవారమంతా జిల్లా అధికారుల నడవడిక, పనితీరును పరిశీలించి తదుపరి వారంలో సక్రమంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు గైకొంటామన్నారు. రహదారులు భవనాలు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులకు సంబంధించి ప్రత్యేక మరమత్తులు, పిరియాడికల్ నిర్వహణ పనులకు సంబంధించి నాడు -నేడు ఎగ్జిబిషన్ ఆయన తిలకించి జిల్లా ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాస నాయక్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే సోమవారం (ఈ నెల 13వ తేదీ ) రాజోలులో జిల్లాస్థాయి అధికారులతో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రెండవస్థాయి అధికారులతో స్థానికంగా కలెక్టరేట్ లో స్పందన ఉంటుందని తెలిపారు. సామాజిక భద్రతా పింఛన్లు, భూ వివాదాలు, కులాంతర వివాహాల ప్రోత్సహకాలు వంటి సమస్యలపై దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారి జివి. సత్యవాణి, వ్యవసాయ శాఖ జెడి వై ఆనందకుమారి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి, పిఆర్ ఎస్ ఈ చంటిబాబు, హౌసింగ్ పిడి పి.రాజేంద్ర, పౌరసరఫరాల డి ఎం ఆర్.తనూజ, డి ఎస్ ఓ కె వి ఎస్ ఎన్ ప్రసాద్, డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి, జెడి ఫిషరీస్ శ్రీనివాసరావు, ఎ డి సర్వే గోపాలకృష్ణ, డి పి ఓ ఆర్.విక్టర్, ఎపిడి ఎమ్ ఎమ్ జిలానీ, జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి కె.లక్ష్మీనారాయణ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.