విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా, రావులపాలెం మండలం, రావులపాలెం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ, కోనసీమ అతలాకుతలం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ప్రజావ్యతిరేక కారణమని వీర్రాజు ధ్వజమెత్తారు. అమలాపురంలో ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగి అల్లర్లలో కేసులు నమోదు చేసిన బీజేపీ కార్యకర్తలను పరామ ర్శించేందుకు వెళ్తున్న ఆయనను రావులపాలెంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సిఆర్సి రోడ్డులో ఒక అపార్ట్మెంట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ ప్రజలను ఇబ్బందులు పెడుతోందిని, మానసికంగా భయభ్రాంతులకు గురి చేస్తోందని, వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉందని అన్నారు. అందుకే తాను కోనసీమ పర్యటనకు బయలుదేరానని చెప్పారు. ఎలాంటి సభలు సమావేశాలు పెట్టడం లేదని, వ్యక్తిగతంగానే కలుస్తున్నానని చెప్పారు. అయితే ఉదయం రాజమండ్రిలో ఇంటి వద్ద నుంచి అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటూ అడ్డుతగులుతూ ఇబ్బందులకుగురి చేసారన్నారు. కడియంలో పల్ల వెంకన్న విగ్రహానికి దండ వేయడానికి వెళ్తే అక్కడకి కూడా పోలీసులు వచ్చారని చెప్పారు. పోలీసులు తనను కోనసీమ వెళ్ళవద్దంటూ ఆలమూరు మండలం జొన్నాడలో అడ్డుకుని దొంగల మాదిరిగా ఫోటోలు తీసి, ప్రైవేటు వాహనాలు అడ్డు పెట్టి వేధింపులకు గురి చేసారన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైన నన్ను అడ్డుకోవడం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం అన్నారు.ప్రభుత్వం తప్పు చేసి, ప్రజలను ఇబ్బందులు పెడితే భారతీయ జనతా పార్టీ సహించదన్నారు. తప్పు చేసిన ప్రభుత్వానికి ప్రజలను ఇబ్బందులు పెట్టే హక్కు లేదన్నారు. కోనసీమ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో అమాయకులపై కేసులు నమోదు చేసారని ఆరోపించారు., కోనసీమ జిల్లా బీజేపీ యువ మోర్చా జనరల్ సెక్రటరీ ఈశ్వర్ గౌడ్ అదేరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళారని, దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు, ఫోటోలు ఉన్నాయని, అయితే అతనిపై అమలాపురం అల్లర్ల విషయంలో తప్పుడు కేసు పెట్టారని, ప్రభుత్వ తప్పుడు చర్యలకు ఇది నిదర్శనం అని ఆరోపించారు.అమలాపురంలో మంత్రి ఇంటిని, ముమ్మడివరం శాసనసభ్యుల ఇంటిని తగలబెడుతుంటే పోలీసులు ఏం చేసారని, చోద్యం చూస్తున్నారని, రాజకీయ నాయకులకు సేవ చేయడం, ఊడిగం చేయడం పోలీసులు నేర్చుకున్నారని ఘాటుగా విమర్శించారు.పోలీసు అంటే గతంలో దమ్ము ధైర్యం కలిగి ఉండే వారని, నేడు అలాంటి చేవ, సత్తువ పోలీసు శాఖలో పోయిందని వీర్రాజు ఎద్దేవా చేశారు. పోలీసు యంత్రాంగం ఏ స్థాయికి వచ్చిందో, ఎంత దిగజారిపోయిందో డీజీపీ ఆలోచన చేసుకోవాలన్నారు.
పోలీసు యంత్రాంగం అంటే ప్రజలను రక్షించడానికి కానీ, రాజకీయ పార్టీలనో, అధికార పార్టీనో రక్షించడానికో కాదన్నారు. మహిళా మోర్చ నాయకురాలి తల్లి చనిపోతే పలకరించడానికి వచ్చానని, బాధితులను, ఇబ్బందులు పడుతున్న వారిని వ్యక్తిగతంగా కలిసి పలకరించే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. సిఎం చేతగాని తనంతో 144 సెక్షన్, 30 సెక్షన్స్ పెట్టి, పోలీసులతో తనను అడ్డుకున్నారని, భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆటలను ఎన్నాళ్ళో సాగనివ్వదన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలను బీజేపీ లెక్కచేయదన్నారు. ఇక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణాన్ని పరిశీలించి, చక్కదిద్దడంలో ప్రభుత్వ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
అంబేద్కర్ పై ఎవరికీ వ్యతిరేకత లేదని, ఆ మహనీయుని వల్లనే నేడు దేశం ముందుకెళ్ళే పరిస్థితి ఉందన్నారు. కోనసీమలో ఇలాంటి పరిస్థితిని అంచనా వేసేందుకు హోం మంత్రి గానీ, డీజీపీ గాని ఇక్కడికి రాలేదని, చాలా చులకనగా తీసుకున్నారని ఆరోపించారు. తప్పులు చేయని వారిని ఇబ్బందులు పెడుతుంటే, వారికి ధైర్యం చెప్పాలని, ప్రభుత్వాన్ని హెచ్చరించాలనే ఇక్కడికి వచ్చానని చెప్పారు.ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని, ఓట్ల రాజకీయాలతో ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్వచ్ఛభారత్ కన్వీనర్ పాలూరు సత్యానందం, పార్టీ నాయకులు బిట్రా శివ నారాయణ, యువ నాయకుడునల్లా పవన్ కుమార్, రాంబోట్ల, కర్రి చిట్టిబాబు, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, యాళ్ల దొరబాబు, కొత్తపేట నియోజకవర్గబిజెపి పార్టీ ఇంచార్జ్ సలాది రామకృష్ణ, గండ్రోతు వీరగోవిందరావు,
గోనెమడతల కనకరాజు, , సంపతి కనకేశ్వరావు, మద్దింశెట్టి శ్రీనివాస్, ఇళ్ల సత్యనారాయణ, నాగిరెడ్డి స్వామి, అయినవిల్లి సత్తిబాబు, కటికిరెడ్డి గంగాధర్, కొవ్వూరి సీతారామిరెడ్డి, ఆత్రేయపురం మండల బిజెపి ప్రధాన కార్యదర్శినడింపల్లి సుబ్బరాజు, జయప్రకాశ్ నారాయణ, చేకూరి రమేష్ వర్మ, కొవ్వూరి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు…