విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం రూరల్:
రాజమహేంద్రవరం, (విశ్వం వాయిస్ న్యూస్):
జిల్లాలో నాటు సారా, శాంతి భద్రతల పరిరక్షణ ఆటంకాలు కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి 10 మందిపై నిర్బంధ పిడి యాక్ట్ ఉత్తర్వులు అమలులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు.ప్రజల ఆరోగ్యాలకు హానికలిగించే నాటు సారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపే దిశలో ఆంధ్రప్రదేశ్ పి డి. యాక్ట్ ను అనుసరించి ఐదుగురి ముద్దాయి లపై, శాంతి భద్రతలకు విఘాతం కలుగచేసే వారిపై లా అండ్ ఆర్డర్ మేరకు పి డి యాక్ట్ కింద మరో ఐదుగురి ముద్దాయి లపై గత నాలుగు నెలల కాలంలో కేసులు నమోదు చేసి ఖైదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా తయారీ, రవాణా వ్యవస్థ లో పాల్గొనే వారి విషయంలో, జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో, గ్రామాలలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా తయారీ కేంద్రాల యొక్క సమాచారాన్ని, లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించే వారి వివరాలు పోలీస్ వారికి తెలియ జేయ్యాలని కోరారు. పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరించాలని ఎవరైనా నాటుసారా తయారీ కేంద్రాలు మరియు విక్రయదారుల యొక్క సమాచారాన్ని తెలియ చేసిన యెడల వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ పి డి యాక్ట్ ను అనుసరించి జిల్లాలో రాజమహేంద్రవరం కి చెందిన నొట్ల భారతి (మేదరపేట), వానపల్లి జయమ్మ తాడితోట), పోలిశెట్టి లక్ష్మి (అయ్యప్పనగర్), రాజమహేంద్రవరం రూరల్ కి చెందిన పొలవరపు నూకరాజు (పీడింగొయ్య), వల్లూరి హరికృష్ణ అలియాస్ ఆండాళ్ (వెంకటనగరం) వారిపై నిర్బంధ ఉత్తర్వులు అమలు చేయబడ్డాయని తెలియచేశారు. తూర్పుగోదావరి జిల్లా లో ఐదుగురి రౌడీ షీటర్లపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. వెంట్రపాటి మహేష్ అలియాస్ పెద్ద చర్చిపేట, రాజమహేంద్రవరం,దాసరి సంతోష్ కుమార్ అలియాస్ సంతు ధవళేశ్వరం,అనాబోయిన మణికంఠ అలియాస్ కోటిమణి, ధవళేశ్వరం, గార రవి తేజ అలియాస్ తేజ కొర్లంపేట, రాజమహేంద్రవరం,గొట్టేటి గోవింద రాజు అలియాస్ గోవింద్ లపై లా అండ్ ఆర్డర్ కింద పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆమె తెలిపారు.కాగా వీరిపై ఏప్రిల్, మే నెలలో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారని తెలిపారు. పలు పోలీస్ స్టేషన్స్ పరిధిలో సివిల్ తగాదలలో వారు ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. దీంతో నేరచరిత్ర ఆధారంగా పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయబడి ఖైదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.