పనిమీద సెలవు కావాలన్నా ఆ అధికారి సెలవు ఇవ్వడానికి ముప్ప తిప్పలు.
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పనితీరులో అనేక పురస్కారాలు అందుకున్న ఘన చరిత్ర కలిగి ఉంది.ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో అనేక మంది ఉత్తమ పనితీరుకు గాను జిల్లా కలెక్టర్ నుంచి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసాపత్రాలను అందుకుంటూ ఉంటారు.పన్నుల వసూళ్ళలో కాని,స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో కాని,ఇతర సేవల విషయంలో కాని ఉద్యోగులు అంకిత భావంతో పని చేసుకువెళుతుంటారనే పేరుంది.ఉదయం ఆఫీసుకు వెళితే రాత్రి ఏటైమ్ లో ఇంటికి వెళతారో వారికే తెలియదు.అలాంటి ఉద్యోగులు ఇటీవల ఓ ఉన్నతాధికారి మాటలకు తీవ్రంగా మనస్థాపం చెందుతున్నారు.కొత్తగా వచ్చిన ఆ అధికారి ఇక్కడి ఉద్యోగులు చిన్నబుచ్చుకునేటట్లు మాట్లాడుతుండడంతో వారు మనస్థాపానికి గురవుతున్నారన్నారని సమాచారం.పైకి ఎవరికీ చెప్పుకోలేక లోలోపల మధనపడుతున్నట్లు తెలుస్తోంది. చెప్పిన పని వెంటనే పూర్తవ్వాలన్నట్లుగా ఆ అధికారి వ్యవహారం ఉంటుందని చెబుతున్నారు.వెంటనే అవ్వదని,సాధ్యం కాదని ఉద్యోగులు చెప్పినా ఆఅధికారి వినరని వాపోతున్నట్లు సమాచారం.ఉద్యోగులు ఏదైనా చెప్పబోతే రాజమండ్రి కార్పొరేషన్ ఉద్యోగులు సరిగా పనిచేయరని, తాను ఇంతకుముందు కమిషనర్ గా చేసిన నరసాపురం పురపాలక సంఘం ఉద్యోగులు చాలా బాగా పనిచేసేవారని అనడం ఇక్కడి ఉద్యోగుల మనస్థాపానికి కారణమవుతున్నట్లు తెలిసింది. 50 నుంచి 60 మంది ఉండే నరసాపురం మున్సిపాలిటీకి 400 మంది ఉద్యోగులు పనిచేసే అతి పెద్ద దైన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థకు నక్కకు నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని ఇంత పెద్ద కార్పొరేషన్లో తలచుకున్నంతనే తాత పెళ్లి జరిగిపోవాలన్న చందంగా చెప్పిన పని వెంటనే జరిగిపోవాలంటే ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.ఇదికాకుండా ఉద్యోగులు ఏదైనా పనిమీద సెలవు పెట్టాలన్నా ఆ అధికారి సెలవు ఇవ్వడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారని వాపోతున్నారు.తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. కమిషనరు ఐఏఎస్ అయినప్పటికీ ఎవరైనా సమస్య చెప్పుకుంటే సావధానంగా వింటారని,కానీ ఈ అధికారి ఎవరికీ చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా కించపరచడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని ఎక్కువ మంది ఉద్యోగులు మానసికంగా నలుగుతున్నట్లు సమాచారం.కనీసం వయసుని, సర్వీస్ ని కూడా చూడకుండా విపరీత ధోరణిలో మాట్లాడుతున్నారని ఉద్యోగులు మనస్థాపం చెందుతున్నట్లు తెలిసింది. కార్పొరేషన్ లో పనిచేయని వారు ఎవరూ లేరని , కానీ కొన్ని పనులు అనుకున్న వెంటనే పూర్తి చేయడం సాధ్యం కాదని ఆ విషయాన్ని సదరు అధికారి గుర్తించి మాట్లాడాలని ఉద్యోగులు కోరుతున్నారు.