విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:
గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా పొందిన రసీదులు ఆధారంగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మార్పు చెందినట్లు కాదని ఆర్డీవో ఎం. ముక్కంటి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీం ద్వారా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేయించుకొనుటకు మీసేవ, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి వారు అక్కడ ఇచ్చే “రిసిప్ట్ ఫర్ ఇంటిమేషన్ ఆఫ్ పేమెంట్ ఫర్ ల్యాండ్ కన్వర్షన్” అనేది వారికి కేవలం రసీదు మాత్రమేనని చెప్పారు. రసీదు పొందినంత మాత్రాన భూమి మార్పు జరిగినట్టు కాదన్నారు. వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఆర్డీవో ఉత్తర్వులు రాతపూర్వకంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఉత్తర్వులు పొందని వారు ఆర్డిఓను నేరుగా కలిసి రాతపూర్వకంగా వివరణ తెలియజేయాలన్నారు. ఈ మేరకు ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఉత్తర్వులు పొందని పలువురు ఈరోజు ఆర్డీవో ముక్కంటిని కలిసి వివరణలు తెలియజేశారు. ఇలా వచ్చిన వివరణలపై సదరు తహసిల్దార్లు పున పరిశీలన చేసి నివేదికలు పంపాలని ఆర్డిఓ ముక్కంటి ఆదేశించారు.