బాబా నగర్ గ్రామానికి స్మశాన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధి గాడి మొగ పంచాయతీ బాబా నగర్ గ్రామానికి స్మశానం లేక గత 70 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొక్క సత్యం(90) అనే వృద్ధుడు గురువారం చనిపోయాడు. చాలా సంవత్సరాలుగా గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి సమీపంలోని కాలువలు గట్లు దాటి, పీకల్లోతు కాలువలు దాటుకుంటూ మరణించిన శవాన్ని తీసుకొని సమీప నదీ పాయ ప్రాంతం వద్ద గట్టుమీద ఖననం చేయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన రాస్తారోకోలో తాళ్లరేవు గాడి మొగ రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాళ్లరేవు తహసిల్దార్ ఎస్ పోతురాజు ఆదేశాల మేరకు గాడి మొగ వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకొని చర్చలు జరిపి మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి స్థలాన్ని చూపించారు. స్మశానానికి స్థలాన్ని కేటాయించాలని ప్రతిపాదన జిల్లా కలెక్టర్కు పంపిస్తామని తాత్కాలికంగా మృతదేహాన్ని ప్రభుత్వ స్థలంలో పూడ్చాలని సూచించారు. దీంతో బాబా నగర్ గ్రామస్తులు మృతదేహం పూడ్చి పెట్టడానికి వెళ్ళగా గాడి మొగ మత్స్యకార గ్రామస్తులు అడ్డుకొనగా బాబా నగర్ గ్రామస్తులు మృతదేహాన్ని పూడ్చివేసి అడ్డు కొనడానికి ప్రయత్నించిన గాడి మొగ మత్స్యకారులతో ఇది ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులను సంప్రదించాలని బాబా నగర్ గ్రామస్తులు అన్నారు. బాబా నగర్ గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా స్మశానానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపించి స్మశానానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు.