– మానవత్వం చాటుతున్న మాలమహానాడు నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, భద్రాచలం:
భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి ఆదివారం గత కొద్ది నెలలుగా యాచకులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం శ్రీరామనవమి రోజు కావడంతో అన్నదాన కార్యక్రమానికి భద్రాచలం పట్టణ ప్రమఖులు కొండిశెట్టి నాగేశ్వరరావు (బుజ్జి) వారి తనయుడు కొండిశెట్టి వెంకట్ సహకారం అందించగా భద్రాద్రి వచ్చిన సుమారు 300 మంది రామ భక్తులకు మరియు యాచకులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండిశెట్టి వెంకట్ , ఏవి.రావు , అలవాల.రాజా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో వివక్షతతో పాటు కుటుంబంలో కూడా వివక్షతను ఎదుర్కొంటూ ఆర్థిక బాధలతో ఒంటరి జీవితం గడుపుతూ సొంత వారు తోడు రాక దీనావస్థలో పూటకోచోట భిక్షాటన చేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారికి అల్లాడి పౌల్ రాజు , తన కుటుంబ సభ్యులు ప్రతి ఆదివారం తమకున్న దాంట్లో ఆకలి తీరుస్తూ, మానవత్వం చాటుతున్నారని , డబ్బున్న ధనికులకు రాని ఆలోచన నిరుపేద కుటుంబంలో పుట్టిన వారికి రావటం ప్రతీ ఆదివారం అన్నదానం చేయడం అందరూ అభినందించాల్సిన విషయమన్నారు. ప్రతి ఆదివారం అన్నదానం చేయటం అంటేనే యాచకుల పట్ల వారికున్న ప్రేమ , ఆప్యాయత , గౌరవం కనిపిస్తుందని పేర్కొన్నారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజు మాట్లాడుతూ పేదల సమస్యల పట్ల పోరాటం చేస్తూ మానవత్వం చాటుతూ పేదలకు అన్నదానం చేస్తుండటం సమాజంలోని నిరుపేదలపై తమకున్న సహృదయం కనిపిస్తుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమం ఎందరో మహానుభావులను గుర్తు చేస్తుందని , ఈ కార్యక్రమం ద్వారా తమకున్నదాంట్లో అన్నదానం చేయటంలో ఎంతో తృప్తి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాడి.సత్యవతి , సుహాసిని , జయరాజ్ , దుర్గ , ప్రమీల తదితరులు పాల్గొన్నారు.