ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం నివారణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – మంత్రి వాసంశెట్టి సుభాష్
అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి.. అవసరమైన సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలి
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుపానుగా బలపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు రానున్న రెండు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. అక్వాన్ తుపాను నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇటీవల అర్నబ్, మురసు తుపానుల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.అవసరమైన సందర్భాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు:
తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులు సూచించే భద్రతా చర్యలను పాటించాలి.మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు.రైతులు తమ పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను రక్షించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రమాదకర ప్రాంతాలు, విరిగిపడే అవకాశం ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు విద్యుత్ తీగలు, నీటితో నిండిన ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.అవసరమైన మందులు, తాగునీరు, నిత్యావసర వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
తుపాను సహాయక చర్యల కోసం ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ *9552300009* ను సంప్రదించాలి.అత్యవసర సహాయం కోసం *112, 1070, 18004250101* నంబర్లకు ఫోన్ చేయాలని మంత్రి సుభాష్ సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సూచించే జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

