మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆందోళన భారీగా మోహరించిన పోలీసు బలగాలు
కోరుకొండ, విశ్వం వాయిస్ న్యూస్ : కోరుకొండలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్రమ మట్టి తరలింపు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రమాదం జరిగిందిలా.. నరసాపురం గ్రామానికి చెందిన నొక్కి రాజు వర్మ (27) క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి క్యాటరింగ్ పని నిమిత్తమే ద్విచక్రవాహనంపై కోరుకొండకు బయలుదేరాడు. అదే సమయంలో జంబుపట్నంలో మట్టి తరలిస్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి రాజు వర్మ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు వర్మ అక్కడికక్కడే దుర్మరణం పాలుకాగా, అతనితో పాటు ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అక్రమ మట్టి తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పూట అక్రమంగా మట్టి తవ్వకాలు, రవాణా కొనసాగించడం వల్లే ఈ ఘోరం జరిగిందని జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేసేంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదని భీష్మించుకుని మృతుడి బంధువులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారీగా మోహరించిన పోలీసు బలగాలు రాస్తారోకో
తో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు కోరుకొండకు చేరుకున్నాయి. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో కోరుకొండలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




