TADIPALLI (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
భూసార పరిరక్షణ, సాగు ఖర్చుల తగ్గింపు, పంట దిగుబడుల పెంపుపై అవగాహన ఆత్మ ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం తాడిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, భూసార పరిరక్షణ పద్ధతులపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ సంచాలకులు బి. నాగకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు శిక్షణ కేంద్రం నుంచి వ్యవసాయ అధికారి మనోహర్, మండల వ్యవసాయ అధికారి టి. మణిదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిపుణులు రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలు, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణ చర్యలు, పంటల దిగుబడుల పెంపు, వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల తగ్గింపు వంటి అంశాలపై వివరించారు. భూమి సహజ సారవంతాన్ని కాపాడుకుంటూ పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా రైతులకు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.

