RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
గత ఇరవై ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని తమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ జేఏసీ ప్రభుత్వంతో అమితుమి తేల్చుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ, వచ్చే నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది ఉద్యోగులతో కలిసి భారీ పోరాటానికి దిగనున్నట్లు జేఏసీ ప్రకటించింది. జేఏసీ రాష్ట్రవ్యాప్త ప్రాంతీయ సదస్సుల్లో భాగంగా రాజమండ్రిలోని రమణం శ్రీరాములు కల్యాణ మండపంలో జరిగిన మొట్టమొదటి మహాగర్జన సదస్సులో ఈ హెచ్చరిక వెలువడింది.
జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గౌరవాధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్న ఎం.టి.ఎస్. హక్కును రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. కేవలం రూ. 7 వేలు, రూ. 8 వేల వేతనాలు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ముద్రవేసి, మరోవైపు సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తానన్న నాయకులు అధికారంలోకి రాగానే మౌనం వహించారని, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి మూడున్నర లక్షల మంది ఉద్యోగుల జీవన పరిస్థితులు కనిపించడం లేదని మండిపడ్డారు.
సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని, ఒరిస్సా, గుజరాత్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తుంటే ఏపీలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సమస్యలపై కనీస చర్చ కూడా జరగకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇకపై విన్నవించే రోజులు పోయాయని, బానిస బ్రతుకులను భరించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు.
ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, హక్కులు అడుగుతుంటే ప్రభుత్వం ఉన్న హక్కులను కూడా కాలరాస్తోందని, రాబోయే కాలంలో క్రమబద్ధీకరణ కోసం రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి. దయామణి మాట్లాడుతూ, ప్రధాన ఉద్యోగ సంఘాలు సమస్యలను పట్టించుకోని నేపథ్యంలో ఉద్యోగులంతా ఐక్యంగా నిలబడి హక్కులను సాధించుకోవాలని కోరారు. ఈ సదస్సులో వివిధ శాఖల సంఘాల రాష్ట్ర నాయకులు రవి ప్రకాష్, కల్యాణి, గంగాధర్, గాంధీ, శశికళ, రాజశేఖర్, సురేష్, జె. వెంకటేశ్వరరావు, సుధీర్ తదితరులు ప్రసంగించి ప్రభుత్వ విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

