RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచిని పెంపొందించడంతో పాటు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు రేవతి సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడరన్ విద్యాసంస్థల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంతికి సంబంధించిన కెల్లిడియోస్కోప్, పెరిస్కోప్, పిన్‌హోల్ కెమెరా, మ్యాజిక్ బాక్స్ వంటి వివిధ అంశాలపై విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు. పరికరాల పనితీరు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను తెలియజేస్తూ విద్యార్థులతో ప్రయోగాలు చేయించారు. ఈ సందర్భంగా రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు కె. శ్రీకృష్ణ సాయి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, అవగాహన పెంపొందించేందుకు వివిధ సైన్స్ అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించడం అవసరమని తెలిపారు. సైన్స్ అనేది అనుభవపూర్వక జ్ఞానమని, పాఠ్యపుస్తకాల్లోని అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయోగాత్మక శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మోడరన్ విద్యాసంస్థల అధినేత జి.వి. రావు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌ను ఉత్సాహంగా నేర్చుకుంటూ వివిధ ప్రయోగాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఆర్. ఉమాదేవి, ప్రధానోపాధ్యాయుడు ఎం. చిట్టిబాబు, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

