Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):
19వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి….
18,19 వార్డుల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం….
మండపేట పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో 18, 19 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.19వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి యాండ్రా ప్రభాకరరావు (బుజ్జి) ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ సీనియర్ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము సతీమణి వసంత, సొసైటీ మాజీ అధ్యక్షుడు పెంకే గంగాధర్‌తో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం 19వ వార్డు అభ్యర్థి యాండ్రా ప్రభాకరరావు, 18వ వార్డు అభ్యర్థి మేడిశెట్టి వెంకటలక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.18, 19 వార్డుల పరిధిలోని పాటిమీద, కేపీ రోడ్డు, శెట్టిబలిజ వీధి, తెనుకుల వీధి, కుక్కలవారి వీధి, సూర్యారావుపేట, తమ్మవారి వీధి, బసవేశ్వరస్వామి గుడి ప్రాంతం, మున్సిఫ్వారి వీధి తదితర ప్రాంతాల్లో నాయకులు ముమ్మరంగా పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, వార్డుల అభివృద్ధికి వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 18, 19 వార్డులతో పాటు పలు వార్డులకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

