
పలు విషయాలను వెల్లడించిన ఎమ్మార్వో ఎం.వి. సాయి ప్రసాద్
రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్:
రాయవరం మండలంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునర్విమర్శ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమానికి ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని మండల తహశీల్దార్ (ఎమ్మార్వో) ఎం.వి. సాయి ప్రసాద్ గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. ఓటరు జాబితా సమగ్రతను కాపాడటం, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారు, నకిలీ మరియు అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా విద్య, ఉపాధి, పట్టణీకరణ కారణంగా ప్రజలు తరచూ వలసలు వెళ్తుండటంతో ఓటరు జాబితాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారమ్ (ఈఎఫ్) అందజేయబడుతుందని, సర్వే దశలో ఎటువంటి పత్రాలు సేకరించబోరని స్పష్టం చేశారు. ఒకవేళ ఇల్లు మూసి ఉంటే పొరుగువారి ద్వారా వివరాలు సేకరిస్తారని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, కొత్త ఓటర్ల కోసం బీఎల్‌వోలు ఫారం-6లను అందుబాటులో ఉంచుతారని తెలిపారు. ఆధార్ కార్డును కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తామని, పౌరసత్వ నిర్ధారణకు అది ఆధారం కాదని స్పష్టం చేశారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం పరిశీలన పూర్తిచేసి సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని చెప్పారు. ఉపాధి, విద్య తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఓటర్ల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు, టోల్‌ఫ్రీ నంబర్ 1950, అలాగే ఈసీఐనెట్ యాప్, వెబ్‌సైట్ ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. “ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండాలి… అనర్హులైన వారి పేర్లు జాబితాలో ఉండకూడదు” అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాయవరం మండల ప్రజలు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఎమ్మార్వో ఎం.వి. సాయి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

