ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeతూర్పుగోదావరిమండల కార్యాలయాలా... మృత్యు ఉచ్చులా .!

మండల కార్యాలయాలా… మృత్యు ఉచ్చులా .!

📰 Generate e-Paper Clip

విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు… అడవిని తలపిస్తున్న పొదలు…

 

పాముల సంచారంతో ప్రాణభయంలో ఉద్యోగులు, ప్రజలు

 

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

 

రాయవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన కార్యాలయాలే ప్రస్తుతం ప్రమాదాలకు నిలయాలుగా మారినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీడీవో కార్యాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, గ్రంథాలయం, హౌసింగ్, వెలుగు, ఉపాధి హామీ తదితర కార్యాలయాల పరిసరాల్లో నెలకొన్న దుస్థితి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

కార్యాలయాల ప్రాంగణంలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు, ఆకులు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. వర్షాకాలంలో బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో అవి ఎప్పుడైనా విరిగి పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా ఉంది.

ఇదే ప్రాంగణంలో మరోవైపు అడవిని తలపించేలా పొదలు, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో విషసర్పాలు యథేచ్ఛగా సంచరిస్తూ కార్యాలయాల లోపలికే చొరబడుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతిరోజూ విధులకు వచ్చే ఉద్యోగులు ప్రాణభయంతోనే పనిచేయాల్సి వస్తుండగా, గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, ప్రజలు చీకటి పడిన తర్వాత ఆ మార్గంలో నడవాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో కనీస శుభ్రత, భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా చర్యలు చేపట్టడం కాకుండా, ముందస్తుగా స్పందించి విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, ప్రాంగణంలోని పొదలను పూర్తిగా శుభ్రం చేసి పాముల బెడదను నివారించడం అధికారుల బాధ్యత కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న ఈ పరిస్థితిని అధికారులు ఇకనైనా సీరియస్‌గా తీసుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని, లేకపోతే ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img