ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతూర్పుగోదావరిఅందరూ చేయూత నిచ్చినా... చిన్నారి ప్రాణం దక్కలేదు

అందరూ చేయూత నిచ్చినా… చిన్నారి ప్రాణం దక్కలేదు

📰 Generate e-Paper Clip

గుండె శస్త్రచికిత్స జరిగిన అనంతరం చిన్నారి కధ విషాదాంతం.. 

రాయవరం గ్రామంలో అలుముకున్న విషాద చాయలు

 

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

 

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ దాతల సహాయం కోసం అందరి మనసులను కదిలించిన రాయవరం గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి నేతల యశ్వంత్ సాత్విక్(4) ఇక లేడు. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించగా, చికిత్సకు సుమారు రూ.6.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండవిల్లి రాంబాబు చొరవ తీసుకుని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు రూ.3 లక్షల ఆర్థిక సహాయం ఆసుపత్రి ఖాతాకు మంజూరయ్యేలా చర్యలు చేపట్టారు. మిగిలిన మొత్తాన్ని సమకూర్చేందుకు ప్రజలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, స్నేహితులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున స్పందించి తమ వంతు సహాయాన్ని అందించారు. అందరి సహకారంతో అవసరమైన నిధులు సమకూరడంతో చిన్నారికి గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే శస్త్రచికిత్స అనంతరం చిన్నారికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్నారి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాద వార్త కుటుంబ సభ్యులతో పాటు చిన్నారి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబంలో తొలి సంతానమైన యశ్వంత్ సాత్విక్ మృతి తల్లిదండ్రులు నేతల రామారావు (రాంబాబు), సంధ్యా దేవి, కుటుంబ సభ్యులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. చిన్నారి ఆరోగ్యం కోసం స్పందించిన గ్రామస్థులు, బంధువులు, దాతలు యశ్వంత్ మరణవార్తతో తీవ్రంగా కలత చెందారు. అందరి సహకారంతో అవసరమైన ఆర్థిక సహాయం సమకూరి చికిత్స అందించినప్పటికీ, చివరకు చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. గ్రామమంతా విషాదఛాయలు అలుముకోగా, చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని భరించే మనోధైర్యం ప్రసాదించాలని కోరుతూ యశ్వంత్ కు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img