ePaper
Wednesday, September 16, 2026
ePaper
Homeతూర్పుగోదావరిగణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):

మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు – నిమజ్జనంలో జాగ్రత్తలు తప్పనిసరి

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని మండపేట రూరల్ సీఐ పి. దొర రాజు, రాయవరం ఎస్సై డి. సురేష్ బాబు లు సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద మండపాల కమిటీ సభ్యులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, నిమజ్జనం సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై పోలీసులు నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులూ గణేష్ మండపాల వద్ద భద్రతా పరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మండపాల వద్ద కమిటీకి చెందిన కనీసం ఒకరు తప్పనిసరిగా అందుబాటులో ఉండి భద్రతను పర్యవేక్షించాలని తెలిపారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ఊరేగింపులో డిజెలు వినియోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, శబ్ద కాలుష్యానికి తావులేకుండా ఉత్సవాలను నిర్వహించాలని, నిమజ్జనం జరిగే కాలువలు, చెరువులు తదితర నీటి ప్రదేశాల వద్ద చిన్న పిల్లలు వెంట రాకుండా తల్లిదండ్రులు, మండపాల కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు సూచించారు. నిమజ్జనం సమయంలో నీటిలోకి దిగే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించిన వ్యక్తులను నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి హంగామా చేసే వ్యక్తులను మండపాల వద్దకు రానివ్వకుండా కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉత్సవాల విషయంలో పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు  సీఐ. దొరరాజు, ఎస్సై సురేష్ బాబు లు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img