కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్:, Kakinada (VISWAM VOICE DESK):
కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్: కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన సిమెంట్ రాయి, కర్రను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించడంతో పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
డబ్బుల విషయంలో వివాదం.. వ్యక్తిపై దాడి
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతుల కాలనీ, తోటమ్మవారివీధిలో డబ్బుల విషయంలో రాజు శివ అనే వ్యక్తికి, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో రాజు శివ తీవ్రంగా గాయపడటంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స కోసం చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూ రాజు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే చికిత్స పొందుతున్న రాజు శివ ఈ నెల 6న మృతి చెందడంతో కేసును హత్య కేసుగా మార్చారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాలతో కాకినాడ ఇన్‌చార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో 3 టౌన్ ఇన్‌స్పెక్టర్ కె.వి.ఎస్. సత్యనారాయణ ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్
దర్యాప్తులో భాగంగా ఈ నెల 13న సాయంత్రం 5.45 గంటల సమయంలో కాకినాడ 3 టౌన్ ఇన్‌స్పెక్టర్ కె.వి.ఎస్. సత్యనారాయణ, సిబ్బంది సహకారంతో నిందితులను పోర్ట్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన సిమెంట్ రాయి, కర్రను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు వీరే
కర్నూలు జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన సాయిపోగు కిరణ్మయి అలియాస్ జెస్సీ, రెడ్డిపోగు అజయ్ కుమార్ అలియాస్ పప్పీని నిందితులుగా గుర్తించారు. వీరు కాకినాడలోని జ్యోతుల కాలనీ, తోటమ్మవారివీధి ప్రాంతంలో నివసిస్తూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా దాడి చేయడంతో మృతి
కాకినాడ రాగంపేట రెల్లివీధికి చెందిన రాజు శివ (41) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాత్‌రూమ్‌లు శుభ్రం చేస్తూ జీవించేవాడని పోలీసులు తెలిపారు. నిందితులతో కలిసి అప్పుడప్పుడు భిక్షాటనకు వెళ్లేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో నిందితులు రాజు శివపై దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాళ్లతో తన్నడంతో పాటు చేతులు, కర్ర, సిమెంట్ రాయితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి, రక్తస్రావానికి గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు
కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన 3 టౌన్ లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ కె.వి.ఎస్. సత్యనారాయణ, ఎస్‌ఐ సాగర్ బాబు, హెడ్ కానిస్టేబుల్స్ పి. పౌలు, ఏ. సతీష్, కానిస్టేబుల్స్ టి. మురళీరాజు, కె. శ్రీనివాస్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అభినందించారు.


