ప్రొసీడింగ్స్ ఆధారంగా వాస్తవాలు వెల్లడించిన మంత్రి సుభాష్
ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు, రాజకీయ నాటకాలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను దాచి, వాటి నెపాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో, ఆలయం విషయంలో ఆ నలుగురే సూత్రధారులు అని, ఇన్ని సంవత్సరాలు విషయం తెలిసి కూడా ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు.2022 ఆగస్టు 18 తేదీతో దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో కొన్న హిందూ దేవాలయాలను, మత సంస్థలను చట్టం ప్రకారం ప్రచురించిన విషయం స్పష్టంగా ఉందని తెలిపారు. అప్పటి ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ జరిగితే అప్పటి ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎంపీ, ఎమ్మెల్సీలకు ఆ విషయం తెలియదా అని నిలదీశారు. ఆలయ కమిటీలో ఉన్న వ్యక్తులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహించారని, ట్రస్ట్ వారసులను తప్పుదారి పట్టించడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2022 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా, హుండీ లెక్కలు, రసీదు పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు సరిగ్గా నిర్వహించారా అని ప్రశ్నిస్తూ, భూములు ఎవరు దోచుకున్నారో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. హుండీ చోరీ ఘటనపై సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలను ఎందుకు పట్టుకోలేకపోయారని, ఆ సమయంలో అప్పటి వ్యవస్థలు ఏం చేశాయని నిలదీశారు. అకాల మరణించిన నాయకుడిని రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని, ద్రాక్షారామం మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సహాయం చేయడానికి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నవారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.*పారదర్శకతతో ఉత్సవాలు నిర్వహణ మరియు ప్రజలకు వాస్తవాలు*శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వ్యవహారంలో ఇకపై పారదర్శకమైన నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆలయ కమిటీలో మార్పులు ఉంటాయని, పారదర్శకంగా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, భక్తుల విశ్వాసానికి ఎలాంటి భంగం కలగకుండా చూస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి వాస్తవాలను కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని, సమాచార హక్కు చట్టం ద్వారా కూడా అధికారిక పత్రాలు పొందవచ్చని చెప్పారు. 1960, 1990 నాటి పాత రాజకీయాలు మానుకోవాలని, కాలం మారిందని, ప్రజలు చైతన్యవంతులయ్యారని స్పష్టం చేశారు. రాజకీయాలకు ఆలయాలను వేదికగా మార్చకుండా, రామచంద్రపురం నియోజకవర్గం, ద్రాక్షారామం అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.

