మండల కేంద్రం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):
- ఓట్ల వేటలో వినూత్న బాట.. సమస్యల పరిష్కారమే ప్రచారాస్త్రం!
- రాయవరంలో ఊపందుకున్న ప్రచారాల హోరు..
- ప్రజా సమస్యలను ప్రచార అస్త్రంగా మలుచుకున్న స్వతంత్ర ప్యానెల్
మండల కేంద్రమైన రాయవరంలో పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. అభ్యర్థుల ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది.

కూటమి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. వైకాపా అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో కూటమి నుంచి సీటు ఆశించి భంగపడిన కొందరు ఆశావహులు స్వతంత్ర ప్యానెల్‌గా ఏర్పడి ప్రజల్లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో రాజకీయం విమర్శలకే పరిమితం కాకుండా గ్రామంలోని ప్రజా సమస్యలను తమ ప్రచారానికి కేంద్రబిందువుగా స్వతంత్ర ప్యానల్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

- అధికారుల నిర్లక్ష్యమే ప్రచార సాధనం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫానుల ప్రభావంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తీవ్రమయ్యాయి. వర్షాలు తగ్గి రోజులు గడుస్తున్నప్పటికీ బ్లీచింగ్ అయిన చెల్లించలేదని పంచాయతీ అధికారుల తీరుపై పలువురు విమర్శిస్తున్నారు. గ్రామంలో దోమల బెడద మరింత పెరిగిందని, దోమల నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ. సంబంధిత అధికారులు తగిన స్థాయిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన స్వతంత్ర ప్యానెల్ సభ్యులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేయిస్తూ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ గ్రామంలో భారీగా గుంతలు ఏర్పడిన రహదారికి కొంతమేర మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దోమల నివారణ చర్యలతో మరోసారి ప్రజా సమస్యలపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది.
- ఎన్నికలు వస్తేనే సమస్యలు కనిపిస్తాయా?
సమస్యలకు అలవాటు పడి అధికారుల తీరుపై విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు లేవనెత్తే ప్రశ్నలు ఎన్నికలు వస్తేనే సమస్యలు గుర్తొస్తాయా..? అనేది ఒకటైతే. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులదా? లేక పంచాయతీ యంత్రాంగానిదా? అనే చర్చ సైతం గ్రామంలో సాగుతోంది. అయితే ప్రజలకు అవసరమైన పారిశుధ్య చర్యలు, దోమల నివారణ, బ్లీచింగ్ వంటి కనీస చర్యలు సాధారణ రోజుల్లోనే చేపట్టాల్సి ఉండగా.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు రంగంలోకి దిగి వాటిని చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఎవరి వైపు ప్రజలు నిలబడతారన్నది ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి. కానీ ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు మాత్రం రాజకీయాలకు అతీతంగా అందాల్సిందే అన్నది గ్రామస్థుల అభిప్రాయం.

