అన్నా-చెల్లి మధ్య ఆస్తి రచ్చ జరుగుతుండగా బంపరాఫర్ ఏంట్రా బాబూ అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే. స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.. షర్మిలకు ఆఫర్ ఇచ్చారు. శనివారం నాడు షర్మిల మీడియా మీట్ పూర్తయిన తర్వాత వైసీపీ మూడు పేజీల సంచలన లేఖను రిలీజ్ చేసింది. ఇది గత నెలలో చెల్లికి అన్న రాసినదే కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా జగన్ ఇలా లేఖాస్త్రాలు వదిలారు. దీంతో ఈ లేఖ తెగ వైరల్ అవుతోంది. అందులో ఏముంది..? ఎందుకు ఇప్పుడు బయటికొచ్చిందనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
నమ్మకం పోయింది..
మూడు పేజీల లేఖలో నాన్న బతికున్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది. చిన్నప్పుడు ఇద్దరు ఎలా ఉండేవారు.. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉంది అనేది మొదలుకుని ఆస్తి తగాదాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ ఉన్నాయి. నాన్న సంపాదించిన, పూర్వీకుల నుంచి ఆస్తులన్నీ ధర్మంగానే, సమానంగానే పంకాలు జరిగాయన్నారు. తాను సొంతంగా కొన్ని వ్యాపారాలను అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. గత పదేళ్లలో రూ. 200 కోట్ల మొత్తానికి ఇచ్చానని, అంతకుమించి ఇంకా చాలానే ఇచ్చామని స్పష్టం చేశారు. నీ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయతతో ఎన్నో ఇచ్చాను. కానీ నువ్వు చేస్తున్న పనులు, నీ అసత్యాలతో నా వ్యక్తిగత ప్రతిష్టతను కూడా దెబ్బతీశావు. దీంతో నా మనసు మారింది. నీపై ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేశావు. నన్ను మోసం చేస్తూ నువ్వు ఇన్ని చేసినప్పుడు నీ పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎలా ఉంటాయి? అందుకే నీకు ఇచ్చిన మాటలన్నీ నేను వెనక్కి తీసుకుంటున్నాను అని జగన్ లేఖలో ప్రస్తావించారు.
ఇదీ అసలు సంగతి..
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా షర్మిల తీరు, ప్రవర్తనలో మార్పు వస్తే ఇదివరకు ఉన్న ప్రేమ, ఆప్యాయతలు తిరిగి పొందుతావన్నారు. అంతేకాదు ఇవన్నీ జరిగాక, కోర్టు కేసులన్నీ పరిష్కారం అయ్యాక షర్మిల కోసం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎంతవరకూ చేయాలి అనే విషయాలు పరిశీలిస్తానని లేఖ రూపంలో చెల్లికి వైఎస్ జగన్ బంపరాఫర్ ఇచ్చారు. దీన్ని లోతుగా అర్థం చేసుకుంటే.. మంచిగా, మర్యాదగా, నీతిగా.. నిజాయితీగా ఉంటే ఆస్తులతో పాటు ఏమేం కావాలో? ఏమేం ఇవ్వాలో అన్ని ఆలోచిస్తాను.. ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. నిజంగా షర్మిలకు ఇది బంపరాఫర్ అనే చెప్పుకోవచ్చు. ఈ లేఖను షర్మిల ఎలా అర్థం చేసుకున్నారో.. ఇప్పుడు ఎలా భావిస్తారో..? అన్న ఆఫర్‌కు ఓకే చెబుతారో లేదో వేచి చూడాల్సిందే మరి.