రాయవరం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):
కూటమి అభ్యర్థి ప్రకటనతో వేడెక్కిన రాజకీయం..
రెబల్స్‌గా రంగంలోకి దిగనున్న ఆశావహులు
యువత, విద్యావంతులతో 14 వార్డుల్లోనూ స్వతంత్ర ప్యానల్ కు ఏర్పాట్లు
మండల కేంద్రమైన రాయవరంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సర్పంచ్ పదవికి కూటమి అభ్యర్థిని గురువారం అధికారికంగా ప్రకటించడంతో ఇప్పటివరకు తెరవెనుక సాగిన రాజకీయ కదలికలు ఒక్కసారిగా వేగం పుంజుకుంటున్నాయి. కూటమి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పలువురు ఆశావహులు అధికారిక నిర్ణయంతో అసంతృప్తికి గురై స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్పంచ్ పదవిని ఆశించిన వారిలో కొందరు వెనక్కి తగ్గకుండా ‘రెబల్’ అభ్యర్థులుగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో కూటమి అభ్యర్థికి అధికారిక మద్దతు ఉన్నప్పటికీ, ఆ మద్దతు ఓట్లుగా ఎంతమేర మారుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామంలోని 14 వార్డుల్లోనూ స్వతంత్ర అభ్యర్థులతో కూడిన ప్యానల్‌ను బరిలోకి దింపేందుకు కసరత్తు జరుగుతున్నట్లు వినికిడి. ఇప్పటికే పలువురు అభ్యర్థులను సమన్వయం చేసే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యుల స్థానాల్లోనూ పోటీ చేయడం ద్వారా గ్రామంలో ప్రత్యామ్నాయ, స్ధిరమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్యానల్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా రాయవరం పంచాయతీ పోరులో మరో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులు, విద్యావంతులు స్వతంత్ర ప్యానల్‌లో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం. సాధారణంగా గ్రామ రాజకీయాల్లో ఆదిపత్య రాజకీయ వర్గాల పోరు కనిపిస్తుండగా, ఈసారి కొత్తతరం రంగప్రవేశం చేయడం ఎన్నికలపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కూటమి అభ్యర్థి ప్రకటనతో ఒక వైపు అధికారిక రాజకీయ సమీకరణం స్పష్టమైనప్పటికీ, మరోవైపు ఆశపడి భంగపడిన ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు, కొత్తగా ఏర్పడుతున్న ప్యానల్ కారణంగా ఓట్ల చీలిక జరుగుతుందని అంశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికతో పాటు 14 వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులను నిలబెట్టగలిగితే ఈ ప్యానల్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. వైకాపా సైతం అభ్యర్థులను ప్రకటించే క్రమంలో తమ ప్యానెల్ విషయంలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యే కొద్దీ రాయవరం పల్లెపోరులో త్రిముఖ పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

