మండల కేంద్రం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):
40 మీటర్ల మేర ఛిద్రమైన రహదారికి మరమ్మతులు
అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సొంత ఖర్చులతో రహదారి పనులు
స్వచ్ఛ రాయవరం ‘మార్పు కావాలి.. మార్పు రావాలి’ అంటూ నినాదాలు
మండల కేంద్రమైన రాయవరంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యువత నడుంబిగించింది. అధికారులు, పాలకులు పట్టించుకోని సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి తమవంతుగా కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలపై ముక్తకంఠంతో స్పందిస్తూ.. అవసరమైతే సొంత ఖర్చులతోనే పరిష్కార చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాయవరం టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదురుగా సుమారు 40 మీటర్ల మేర పూర్తిగా ఛిద్రమైన రహదారికి యువత మరమ్మతులు చేపట్టింది. రహదారి అధ్వానంగా మారి గుంతలు, రాళ్లతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యం వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గమే ఇలా అధ్వానంగా మారినా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురుచూడకుండా తమ సొంత ఖర్చులతో జేసీబీ, ఇతర సామగ్రి సహాయంతో రహదారి మరమ్మతు పనులు ప్రారంభించారు. రహదారి పనులు చేపట్టడంతో పాటు అధికారుల తీరును నిరసిస్తూ యువత చేతుల్లో ఫ్లకార్డులు పట్టుకుని ‘మార్పు కావాలి.. మార్పు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. గ్రామంలోని ప్రధాన సమస్యలపై అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించడం కాకుండా.. వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలోకి వచ్చి పనిచేయడం యువతలోని బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనంగా నిలిచిందని, ‘అధికారులు చేయకపోతే మనమే ఎందుకు చేయకూడదు?’ అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న యువతను పలువురు అభినందించారు. గ్రామంలోని ఇతర సమస్యలపైనా ఇదే తరహాలో స్పందించి పరిష్కార దిశగా అడుగులు వేస్తామని యువత స్పష్టం చేసింది. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు కూడా బాధ్యతగా వ్యవహరించి, యువత చూపిస్తున్న చొరవకు తోడ్పాటు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

