మండలం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):
మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఓటర్ స్లిప్పుల పంపిణీపై పలువురు ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ముందుగానే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉండగా, పలుచోట్ల స్లిప్పులు అందకపోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి స్లిప్పులు లేకపోవడంతో తమ ఓటు ఎక్కడ ఉందో, ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలో తెలుసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్దే సచివాలయ సిబ్బంది ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
- “ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసినా.. ముందుగా ఓటర్ స్లిప్పులు ఎందుకు ఇవ్వలేదు? పోలింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత స్లిప్పుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?” అంటూ కొంతమంది ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో చిన్నపాటి లోపాలు కూడా ఓటర్లకు అసౌకర్యంగా మారుతాయని, ఇకనైనా అధికారులు స్పందించి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.

