కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్:, Kakinada (VISWAM VOICE DESK):
కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రూ.20 లక్షల నగదు చోరీ కేసులో నిందితుడికి న్యాయస్థానం 7 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రయల్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నంబర్ 455/2025, బీఎన్ఎస్ సెక్షన్లు 331(1), 305(ఏ) కేసులో కాకినాడ మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. శ్రీదేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. కేసులో నిందితుడు కాకర లోవరాజు (34), తండ్రి అప్పారావు, సూర్యనారాయణపురం, కాకినాడను దోషిగా నిర్ధారించి 7 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 22 రాత్రి 10.30 గంటల నుంచి డిసెంబర్ 23 ఉదయం 9 గంటల మధ్య కాకినాడ గంజాం వారి వీధిలోని అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణం షట్టర్, తాళాలు పగులగొట్టి సుమారు రూ.20 లక్షల నగదును దొంగిలించారు. దుకాణ యజమాని హితేష్ రాజ్ పురోహిత్ (32) ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2025 డిసెంబర్ 23న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేశారు. అనంతరం నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో విచారణను సమర్థవంతంగా కొనసాగించారు. పోలీసుల దర్యాప్తు, ప్రభుత్వ న్యాయవాది వాదనలతో కేసులో నిందితుడికి శిక్ష పడింది.
కేసు ట్రయల్‌ను కాకినాడ వన్‌టౌన్ సీఐ ఎం. నాగదుర్గారావు పర్యవేక్షించగా, ప్రభుత్వ తరఫున ఏపీపీ కె. సుధారాణి వాదనలు వినిపించారు. కేసు విచారణలో జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐపీఎస్, కాకినాడ ఇన్చార్జి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణ కీలకంగా నిలిచింది.
కేసు ట్రయల్‌కు సహకరించిన కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎన్. సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ ఎం. నాగదుర్గారావులను జిల్లా ఎస్పీ అభినందించారు. ట్రయల్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తుతో పాటు కోర్టు విచారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

