ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeతూర్పుగోదావరివిద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 1989-94 బ్యాచ్‌ ఆదర్శం

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 1989-94 బ్యాచ్‌ ఆదర్శం

📰 Generate e-Paper Clip

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):

రామయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత పట్టుదలను పెంపొందించవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలన అత్యంత ఘనంగా శనివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విప్పర్తి శాంతి సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌ దేవిశెట్టి కోటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశభక్తి, క్రమశిక్షణ, విద్యార్థుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఉండవల్లి రాంబాబు, తేతలి సుబ్బిరామిరెడ్డి, డాక్టర్‌ జి.ఎస్‌.ఎన్‌.రెడ్డి, మల్లిడి హరినాథరెడ్డి, కోణాల వెంకటరెడ్డి బ్యాచ్‌ సభ్యులు, చింతా పాండురంగారెడ్డి మనవడు పాండురంగారెడ్డి, రిటైర్డ్‌ హిందీ ఉపాధ్యాయులు పడాల సత్యనారాయణరెడ్డి, రిటైర్డ్‌ సోషల్‌ ఉపాధ్యాయులు షేక్‌ మీరాకాసిం తదితరులు హాజరయ్యారు.

విద్యార్థులకు రూ.1.40 లక్షల ప్రోత్సాహకాలు

 

పాఠశాల 1989-94 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు రూ.1.40 లక్షల వ్యయంతో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రైజ్‌మనీ, షీల్డ్లు, నాలెడ్జ్‌ పుస్తకాలను అందజేశారు. దీంతో పాటు విద్యార్థుల కోసం స్పోర్ట్స్‌ మెటీరియల్‌, క్రాఫ్ట్‌ శిక్షణకు రెండు స్టిచింగ్‌ మిషన్లను అందించారు. డ్రాయింగ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు.

ప్రతిభకు నగదు బహుమతులు

 

మల్లిడి మంజువాణి జ్ఞాపకార్థం మల్లిడి మీనాక్షి, మల్లిడి హరినాథరెడ్డి ఆధ్వర్యంలో 2025-26 పదో తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.20 వేల నగదు బహుమతులు అందజేశారు. అలాగే రిటైర్డ్‌ హిందీ ఉపాధ్యాయులు పడాల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి హిందీ సబ్జెక్టులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదు బహుమతులు అందించారు. రిటైర్డ్‌ సోషల్‌ ఉపాధ్యాయులు షేక్‌ మీరాకాసిం ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.4,500 ప్రైజ్‌మనీ అందజేశారు. రిటైర్డ్‌ హెచ్‌ఎం వీరయ్యమ్మ, కొవ్వూరి అమ్మిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె కొవ్వూరి విజయగీత పదో తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు షీల్డులను అందజేశారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వేడుకల అనంతరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలకు పెద్దల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కార్యక్రమానికి హాజరైన పెద్దలు విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి దేశాభివృద్ధికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img