కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి డా. డి. తిప్పే నాయక్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు.

